వాడిపడేసే పళ్లాలు, గ్లాసులు.. వైరస్ నేర్పిన కొత్త పాఠాలు

వాడిపడేసే పళ్లాలు, గ్లాసులు.. వైరస్ నేర్పిన కొత్త పాఠాలు
X

కరోనాకి ముందు నలుగురు కలిస్తే రెస్టారెంట్ వైపే అడుగులు. ఇప్పుడు అటువైపు చూడాలంటేనే భయంగా ఉంది. హోటల్స్ ఓపెన్ చేసినా తక్కువ సిబ్బందితో నడిపిస్తున్నాయి. భౌతిక దూరం పాటించే దిశగా టేబుల్ కి ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోకుండా గబగబా కానిచ్చేయాలి. పాత కంచాలు, గ్లాసుల స్థానంలో డిస్పోజబుల్ వస్తువులు వచ్చి చేరాయి. తినడం పడేయడం. ఏం కావాలో సెలెక్ట్ చేసుకునే మెనూ కార్డ్ లేదు. ఆ రోజు అందుబాటులో ఉన్న ఆహార పదార్ధాలు ఎలక్ట్రానిక్ డిస్ ప్లే పై ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి నచ్చినవి చెప్తే పట్టుకుని వస్తారు. నోరు మూసుకుని కాదులెండి.. తెరిచే తిని వచ్చేయడమే.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రెస్టారెంట్ కి వెళ్లాలంటే కరోనా భయం వెంటాడుతోంది. ఎవరితో మాట్లాడితే ఏం వస్తుందో.. అసలు వాళ్లక్కూడా కరోనా వచ్చిన విషయం తెలియక పోవడం మహమ్మారి మహత్యం కాక మరేమిటని వాపోతున్నారు పాత రోజుల్ని నెమరు వేసుకుంటున్న ప్రజలు. ఎక్కువగా ఆన్ లైన్ ఆర్డర్లు వస్తున్నాయని ఓ హోటల్ నిర్వాహకుడు చెప్పుకొచ్చారు. జొమాటో, స్విగ్గి, ఉబర్ యాప్ ల ద్వారా ఆర్డర్లు వస్తున్నాయని అన్నారు. పెద్ద పెద్ద హోటళ్ల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. మరి ముందు ముందు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు రోజుకి 500 బిర్యానీలు ఆర్డర్ వస్తే ఇప్పుడు కేవలం 25 ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయని రెస్టారెంట్ యజమానులు అంటున్నారు. డెలివరీ బాయ్ ఫుడ్ ప్యాక్ తీసుకొని వచ్చినా అపార్ట్ మెంట్ వాసులైతే కిందికి వెళ్లి తీసుకోవాలి. హోమ్ డెలివరీలపై భయాన్ని తొలగించేందుకే కాంటాక్ట్ లెస్ డెలివరీకి ప్రయత్నిస్తున్నామని జొమాటో ప్రతినిధులు తెలిపారు.

Next Story

RELATED STORIES