భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. భారీగా సైనిక బలగాల మోహరింపు

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. భారీగా సైనిక బలగాల మోహరింపు

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, నౌకలు మోహరింపునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. త్రివిధ దళాలతో సమన్వయం చేసుకుని అవసరమైన ఆయుధాలను.. యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుకోవాలని సీడీఎస్‌ బిపిన్ రావత్ ఆదేశించారు. అటు.. వాస్తవాధీన రేఖ వెంబడి 47 అదనపు బోర్డర్‌ అవుట్‌ పోస్టుల్లో బలగాల మోహరింపు జరుగుతోంది.

లద్దాక్‌లోని గాల్వన్ లోయలోకి సోమవారం రాత్రి చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. దీంతో చైనా బలగాలను భారత సైన్యం అడ్డుకుంది. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగడంతో మొత్తం 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మొదట తెలంగాణవాసి కల్నల్ సంతోష్‌ బాబుతో పాటు ఇద్దరు జవాన్లను గుర్తించిన అధికారులు.. ఆ తర్వాత మరో 17 మందిని గుర్తించారు. ఇక, భారత బలగాలు చేసిన ప్రతిదాడిలో 43 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే, ఇరుదేశాల వైపు మృతిచెందిన సైనికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే వుండొచ్చని తెలుస్తోంది.

ఇదిలావుంటే, లద్దాక్‌లో భారత సైన్యంపై చైనా దాడిచేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. పలు చోట్ల చైనా పతాకం, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు, చైనా దుందుడుకు వైఖరిపై మాజీ సైనికాధికారులు, సైనికరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా వ్యూహాత్మక దాడేనని.. భారత్ అప్రమత్తంగా వుంటూనే డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు.

చైనా తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యమని ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగింది చాలని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం వుందన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆయన ఎందుకు పలు విషయాలను దాచిపెడుతున్నారని అన్నారు.

భారత్ - చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణనాన్ని నిశితంగా గమనిస్తున్నామని అన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు.

చైనా దాడులకు వ్యతిరేకంగా దేశంలోని వ్యాపారులంతా ఒక్కటవుతున్నారు. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిద్ధమైంది. చైనా ఉత్పత్తులను బహిష్కరించడానికి, భారతీయు వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి 'ఇండియన్ గూడ్స్ అవర్ ప్రైడ్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసింది. వీటిని బహిష్కరించాలని నిర్ణయిచింది. రోజువారీ వినియోగ వస్తువులు, బొమ్మలు, దుస్తులు, బిల్డర్ హార్డ్‌వేర్, పాదరక్షలు, కిచెన్‌వేర్ వంటి వస్తువులను బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యింది.

ఇదిలావుంటే, ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా చైనా సంస్థలను నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనా ఘర్షణలో అమరులైన సైనికులకు అదే ఘనమైన నివాళి అని తెలిపింది. అలాగే ప్రజలు కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story