తాజా వార్తలు

వీరుడికి యావత్ జాతి కన్నీటి వీడ్కోలు

వీరుడికి యావత్ జాతి కన్నీటి వీడ్కోలు
X

దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన వీరుడికి యావత్ జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. కల్నల్ సంతోష్‌బాబు అంతిమయాత్ర సందర్భంగా సూర్యాపేటలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. తల్లిదండ్రులు, బంధువులే కాదు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ర్యాలీగా తరలిరాగా కేసారం వరకూ యాత్ర సాగింది. ప్రత్యేక వాహనంపై సంతోష్‌బాబు పార్థివదేహాన్ని వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లారు. జవాన్లతోపాటు పలువురు పాడె మోస్తూ జోహార్లు అర్పించారు. సైనిక లాంఛనాల మధ్య అక్కడ అంత్యక్రియలు జరిగాయి. పలువురు జాతీయజెండాతో సెల్యూట్ చేస్తూ సంతోష్‌కి కడసారి వీడ్కోలు పలికారు.

అశ్రునయనాల మధ్య సంతోష్ తండ్రి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. సంతోష్‌బాబు భార్య సంతోషి, కుమారుడు అనిరుధ్‌ను ఎత్తుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుట్టెడు దుఖం గుండెల్ని పిండేస్తున్నా.. ఆ బాధను పంటి బిగువనే ఉంచుకుని అమరుడైన భర్తకు నివాళులు అర్పించారు. ఈ దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. అంత్యక్రియలకు ముందు ఆర్మీ అధికారులు యనిఫాంను సంతోష్‌బాబు భార్య సంతోషికి అందచేశారు. ఆ క్షణాన అందరి కళ్లు చెమర్చాయి. కానీ దేశం కోసం ప్రాణాలర్పించిన భర్త త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆమె ఆత్మనిబ్బరంతో భర్తకు సెల్యూట్ చేశారు. జోహార్ కల్నల్ నినాదాలు ఆ ప్రాంతమంతా మార్మోగాయి. ఆర్మీ పద్ధతి ప్రకారం గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాక.. స్థానిక ప్రముఖులంతా సంతోష్‌కి అంజలి ఘటించారు. భారత్ మాతాకీ జై నినాదం ఆ ప్రాంతమంతా మార్మోగింది.

దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించేందుకు ఏమాత్రం వెనుకాడకుండా.. సరిహద్దుల్లో శత్రువుకి ఎదురొడ్డి నిలబడి పోరాడి అశువులుబాసిన అమరవీరుడు సంతోష్‌బాబు. 16 బీహార్ ఆర్మీ రెజిమెంట్ కల్నల్‌గా తన టీమ్‌ను ముందుండి నడిపించడంలోనే కాదు.. శత్రువుతో తలపడడంలోనూ తానే లీడ్ తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ సంతోష్‌ సహా 20 మంది అశువులు బాసినా.. అటువైపు చైనాకు సైతం పెద్ద సంఖ్యలో నష్టం వాటిల్లింది. శత్రుదేశం నుంచి దాదాపు 45 మంది హతమయ్యారంటే.. మన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడారో అర్థం చేసుకోవచ్చు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన ఈ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంతా జోహార్లు అర్పించారు.

Next Story

RELATED STORIES