ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4గంటలవరకు ఎన్నికలు జరుగనున్నాయి. 5గంటలకు ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఇందుకుగాను వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ బరిలో ఉండగా... టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు విప్ జారీ చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేశారు. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబును, పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటిని నియమించారు. సభ్యులంతా ఓటింగ్‍లో పాల్గొనాలని టీడీపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ ఏజెంట్‍కు చూపించి ఓటు వేయాలని నిబంధన పెట్టారు.

రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైసీపి పార్టీ ఎమ్మెల్యేలకు మాక్ ఓటింగ్ నిర్వహించింది.ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యేలకు విప్‌ జారీ అయింది. సంఖ్యా బలం ఉన్నందున తొలి ఓటు ప్రాధాన్యం ఎమ్మెల్యేలకు సూచించింది. రెండు, మూడు ప్రాధాన్య ఓట్లు కూడా వేస్తే పొరపాట్లు దొర్లవచ్చనే ఉద్దేశంతో తొలి ప్రాధాన్య ఓటుకే పరిమితం కావాలని నిర్ణయించారని సూచించినట్లు తెలిసింది. శాసనసభ్యులు మొత్తం 1 75 మంది ఉన్న నేపథ్యంలో.... ఒక్కో అభ్యర్థి ఎంపికకు 36 మంది ఎమ్మెల్యేల ఓట్లు సరిపోతాయని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లెక్క ఆధారంగానే వైకాపా నలుగురు అభ్యర్థుల్లో తొలి ముగ్గురికి 38 మంది చొప్పున, నాలుగో అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేలు ఓటేసేలా స్పష్టమైన విభజన చేసింది. బరిలో నిలిచిన నలుగురు అభ్యర్థులు వారికి కేటాయించిన ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. అభ్యర్థి నత్వానీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ ఎన్నికలకు పార్టీ ప్రతినిధిగా ఎంపిక చేశారు.

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలుంటాయి. వీటిలో 229 స్థానాలను దేశంలని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన వారిని కేంద్రపాలితప్రాంతాలనుంచి నలుగురు, కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం నుంచి 12మంది ప్రముఖులు ఎన్నికవుతారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 18 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే.. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి 11, తెలంగాణకు 7గురు ప్రాతినిధ్య వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story