మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం

మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం
X

గాల్వన్ లోయలో చైనాతో ఘర్షణల నేపథ్యంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా బలగాలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయం తీసుకోవాలని సైన్యానికి కేంద్రం సూచించింది. అలాగే, త్రివిధ దళాల కోసం అత్యవసర నిధి కింద 5 వందల కోట్లు కేటాయించింది. విపత్కర పరిస్థితుల్లో తక్షణమే వినియోగించుకోవడానికి ఆ నిధులు వాడుకోవచ్చు. రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. వాస్తవాధీనరేఖ వెంబడి దళాల మోహరింపు, బోర్డర్‌లో తాజా పరిస్థితిపై చర్చించారు. సరిహద్దుల్లో చైనా మళ్లీ రెచ్చిపోతే దీటుగా బదులివ్వాలని త్రివిధ దళాలకు రాజ్‌నాధ్‌సింగ్ స్పష్టం చేశారు. సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చైనాకు తగిన బుద్ది చెప్పాలని తేల్చి చెప్పారు. చైనా విషయంలో కఠినంగానే ఉండాలని చెప్పారు.

లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చైనా దురాగతాల నేపథ్యంలో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. చైనా దాడులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో భారీ ఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించారు. బోర్డర్‌లో యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి. సుఖోయ్‌-30-M.K.I, మిగ్‌-29, జాగ్వార్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక యుద్ధ విమానం అపాచీ ఫైటర్ జెట్లను కూడా సరిహ ద్దులకు తరలిస్తున్నారు. శ్రీనగర్‌, అవంతిపొర, లేహ్‌ ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టడానికి వాయుసేనను కూడా సిద్ధం చేశారు. చైనా సరిహద్దుల్లో మిరాజ్-2000 యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించారు. లద్ధాక్‌ ఎయిర్‌బేస్‌లోనూ భారత యుద్ధ విమానాల కదలికలు ఊపందుకున్నాయి. గాల్వన్ లోయ ప్రాంతంతో పాటు సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు కూడా ఫైటర్ జెట్స్ చేరుకున్నాయి.

ఇక, గాల్వన్ లోయలో భారత సైన్యం దూకుడు పెంచింది. గాల్వన్ వ్యాలీలో వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భారత జవాన్లు 72 గంటల్లోనే డ్యామ్‌ను నిర్మించేశారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఏకధాటిగా పని చేసి వంతెన నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. బ్రిడ్జ్‌పై రెండు గంటల పాటు వాహనాలను నడిపి సక్సెస్‌ఫుల్‌గా టెస్టులు చేశారు.

Next Story

RELATED STORIES