తెలంగాణలో 30కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యం

తెలంగాణలో 30కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యం

రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏటా ఉద్యమంలా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో కోట్లాది మొక్కలను నాటారు. వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వమే తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తోంది.. ఈసారి 30కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా సన్నాహాలు చేస్తున్నారు..

గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్క నాటి ఈ హరితహారాన్ని మొదలుపెడుతారు. ఉదయం 11 గంట‌ల‌కు న‌ర్సాపూర్ ఫారెస్ట్ వేదిక‌గా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్‌రావు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి పాల్గొన్నారు..

రాష్ట్రంలో పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో 2015 జులై3న తొలిసారి హైదరాబాద్‍లో హరితహారం ప్రారంభించారు. తెలంగాణలో 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు...ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 182 కోట్ల మొక్కలు నాటారు..

రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story