తాజా వార్తలు

కరోనా తెచ్చిన కష్టం.. పాఠశాల మాస్టారు పలుగూ, పార చేతబట్టి..

కరోనా తెచ్చిన కష్టం.. పాఠశాల మాస్టారు పలుగూ, పార చేతబట్టి..
X

మార్చిలో పరీక్షలు, మేలో రిజల్ట్, జూన్ లో మళ్లీ కొత్త విద్యాసంవత్సరం ఆరంభం.. కరోనా వచ్చి మొత్తం తలక్రిందులు చేసేసింది. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో కరోనా కల్లోలం రేపింది. అవే ముచ్చట్లు.. బడికి వెళ్లాలంటే భయం. అసలు బుక్కు ముట్టకపోతే వచ్చిన నాలుగు అక్షరాలు కూడా పోతాయేమోని ఆన్ లైన్ లో ఏం చెప్పినా వినమంటున్నారు తల్లిదండ్రులు. బడులు మూతపడడంతో మాస్టార్లకు జీతాల్లేవు.. చదువు చెబుదామంటే పిల్లలు లేరు. పాఠశాల యాజమాన్యాలు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలివ్వలేమంటూ చేతులెత్తేయడంతో బ్రతకడానికి ఏదో ఒక పని చూసుకుంటున్నారు బడి పంతుళ్లు.

పని లేదు పైసల్లేవు. పస్తులెట్లా ఉండేదని పలుగూ పార చేతబట్టి పనికి వెళుతున్నారు.. వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు.. బిల్డింగ్ పనుల్లో తల దూరుస్తున్నారు. టీచరమ్మలు వచ్చిన టైలరింగ్ వర్కో, బీడీలు చుట్టడమో చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది టీచర్ల పరిస్థితి ఇలానే ఉంది. రాష్ట్రంలో దాదాపు 11,700 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1,20,350 మంది వరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావం వాటన్నింటిపైనా పడింది.

ఇప్పట్లో బడులు తెరిచేది లేకపోవడంతో ఆన్ లైన్ పాఠాలు కొద్ది మంది టీచర్లతో చెప్పిస్తున్నాయి చాలా పాఠశాలలు. చాలా మందిని విధుల నుంచి తొలగించాయి. దాదాపు 70 శాతం మంది ప్రైవేటు ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా వేరే ఉపాధి మార్గం చూసుకుంటున్నారు. నగరాల్లోని ఉపాధ్యాయులు పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పని చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇప్పుడు వారిలో 500 మందిని విధుల నుంచి తొలగించారు. మరో వెయ్యి మందికి వేతనాలు నిలిపివేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉండి, ఆన్ లైన్ క్లాస్ తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నవారినే ఉపాధ్యాయులుగా కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో చేనేత పని వచ్చిన వారు ఆ వృత్తిలోకి దిగిపోయారు. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యవసాయ పనులు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మాస్టార్లు భవన కార్మికులుగా మారిపోయారు. భవిష్యత్తులో బడికి వెళతామో లేదో.. పిల్లలకు పాఠాలు చెబుతామో లేదోనన్న ఆందోళనతో ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు.

Next Story

RELATED STORIES