గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం

మంత్రి కేటీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా బల్కంపేటలో స్మశానవాటికలో మొక్కలు నాటారు. మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అలాగే బోయగూడలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పార్కును కూడా ప్రారంభించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో హరితహారంలో పాల్గొన్న అనంతరం మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్లారు KTR. దుండిగల్‌లో ORR ఎగ్జిట్‌-5 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సారి హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అంతా ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడిక్కడ నర్సరీల నుంచి ఇప్పటికే మొక్కలు గ్రామాలకు, పట్టణాలకు చేరినందున అంతా మొక్కలు నాటాలన్నారు. అలాగే వాటి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. 'ఈచ్‌ వన్.. ప్లాంట్ వన్' నినాదంతో అంతా మొక్కలు నాటాలని KTR కోరారు. పట్టణాలు, పల్లెలు సహా యావత్ తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

ఆరవ విడత హరితహారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం మండలం మోహబ్బాత్‌ నగర్‌ గ్రామంలోని శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు.. సీఎం కేసీఆర్‌ ఆశయం మేరకు రాష్ట్రాన్ని ఆకుపచ్చని వనంగా తీర్చిదిద్దుతామని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునేందుకు కృషి చేయాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో ఆరవ విడత హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. హరిత తెలంగాణనే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు. చెట్లను సమృద్ధిగా పెంచితేనే వర్షాలు కురుస్తాయన్నారు. హరిత హారం విజయవంతం కావాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.

కాలుష్యాన్ని నివారించడం, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలిగించాలంటే పచ్చదనం పెంపొందించడం ఒక్కటే మార్గమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల మినీ ట్యాంక్‌ బండ్‌పై హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరేళ్లుగా కోట్లాది మొక్కలు నాటారాని.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలంతా వన సంరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని నేరుడుచర్ల మండలం పెంచికలదిన్నెలో జరిగిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో అటవీ భూమి విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని, తద్వారా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఆరో విడత హరితహారంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ నేత దానం నాగేందర్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని రామచంద్రరావు పార్కులో మొక్కలు నాటారు. దేశంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించటమే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారాయన. ప్రతిఒక్కరు హరితహారంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story