తల్లికి ఫేస్‌బుక్‌లో ఇద్దరితో పరిచయం.. ఆమెను బెదిరించే క్రమంలో చిన్నారి హత్య

తల్లికి ఫేస్‌బుక్‌లో ఇద్దరితో పరిచయం.. ఆమెను బెదిరించే క్రమంలో చిన్నారి హత్య
X

తల్లికి ఫేస్‌బుక్‌లో ఇద్దరు యువకులతో ఏర్పడ్డ పరిచయం.. కూతురు ప్రాణాల్ని బలితీసుకుంది. మేడ్చల్‌ లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

తెలంగాణ భువనగిరికి చెందిన వ్యక్తికి ఏపీ అనంతపురానికి చెందిన యువతితో సోషల్‌మీడియాలో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. 2011లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో పాప పుట్టింది. గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న పాప తండ్రి తన కుటుంబాన్ని రెండు సంవత్సరాల క్రితం పోచారంకు మార్చాడు.

ఈ నేపథ్యంలో పాప తల్లికి ఫేస్‌బుక్‌లో కరుణాకర్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలానికి ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తితో కూడా ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో ముగ్గురు ఫ్రెండ్స్ ‌గా మారారు. ఈ సమయంలో రెండు నెలలనుంచి ఆమె కరుణాకర్‌ను దూరం పెట్టింది. దీంతో ఆమెపై ఆగ్రహాం పెంచుకున్నాడు కరుణాకర్‌. పక్కా ప్లాన్‌తో కత్తి వెంటపెట్టుకుని ఆమె ఇంటికి వచ్చాడు. అప్పటికే మరో యువకుడు.. ఆమె ఇంట్లో ఉన్నాడు. కరుణాకర్‌ వచ్చిన విషయాన్ని గమనించిన ఆమె.. ఆ యువకుడిని బాత్‌రూంలో దాచిపెట్టింది. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో కూతురుతో కలిసి కూర్చొంది.

కరుణాకర్‌ నేరుగా బెడ్‌రూమ్‌లోకి వచ్చాడు. అయితే వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె కోపంతో.. కరుణాకర్‌తోపాటు తన కూతురునూ బెడ్‌రూమ్‌లో వదిలేసి బయటికొచ్చి గడియపెట్టింది. కరుణాకర్‌ ఆగ్రహంతో ‘తలుపు తీయకపోతే నీ కూతురును చంపేస్తా’అని బెదిరించాడు. ఆ వెంటనే కత్తితో పాప గొంతుకోశాడు. అమ్మాయి పెద్దగా కేకలు వేయడంతో తల్లి గది లోపలికి పరిగెత్తుకెళ్లింది.

దీంతో బాత్‌రూంలో ఉన్న యువకుడు బయటకు వచ్చాడు. వెంటనే అతనిపై కూడా కరుణాకర్‌ కత్తితో దాడి చేశాడు. తప్పించుకున్న యువకుడు గోడదూకి పారిపోయాడు. ఆ తర్వాత కరుణాకర్‌ ఇంటి బయటకు వచ్చి గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్‌కి తరలించారు.

కాగా, కరుణాకర్‌, మరో యువకుడు తరచూ ఇంటికి వచ్చేవారని, తనను అన్నా అని, తన భార్యను అక్కా అని పిలిచేవారని పాప తండ్రి పోలీసులకు తెలిపాడు. తన బిడ్డను చంపేంత తప్పు తామేం చేయలేదని కన్నీరుపెట్టారు. తల్లికి ఇద్దరు యువకులతో ఏర్పడ్డ స్నేహం కారణంగానే పాప హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES