కొవిడ్ పార్టీకి వెళ్లి కోరి మరణం..

కొవిడ్ పార్టీకి వెళ్లి కోరి మరణం..

అన్నీ తెలిసిన మానవుడు జంతువులా ప్రవర్తిస్తున్నాడు. అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో ఉంటున్నారు. మహమ్మారి కరోనా వైరస్ ఎంత మంది జీవితాలను ఛిద్రం చేస్తుందో తెలుసు. అయినా పైశాచిక ఆనందం కోసం కోవిడ్ పార్టీలు చేసుకుంటున్నారు. కరోనా సోకిన వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినంత ఆనందంగా పార్టీలు చేసుకుంటున్నారు. పార్టీకి మిత్రులను ఆహ్వానిస్తున్నారు. దీంతో వైరస్ ని తేలిగ్గా తీసుకుని పార్టీకి హాజరైన వ్యక్తి కొవిడ్ తో మరణించాడు.

ఈ సంఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 30 ఏళ్ల ఓ యువకుడు వైరస్ తనపై అంతగా ప్రభావం చూపదని భావించాడు. ఒకవేళ కరోనా వచ్చినా నేను దాన్ని జయించగలను అని పార్టీకి హాజరై ఎంజాయ్ చేశాడు. కానీ కరోనాకి అలాంటి వాళ్లంటే మరీ మంట. నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పార్టీలు పబ్బులంటూ తిరుగుతారా.. అని దాడి చేసింది. ఫలితంగా ఆస్పత్రి మెట్లెక్కాల్సి వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానిక సాన్ ఆంటోనియాలోని మెథడిస్ట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో చివరకు ప్రాణాలు విడిచినట్లు ఆసుపత్రి వైద్యాధికారి జేన్ ఆప్పిల్ బై వెల్లడించారు.

అయితే, చికిత్స సమయంలో.. నేను తప్పు చేశాను డాక్టర్.. యువకుడినే కదా వైరస్ ని జయిస్తానని అనుకున్నా. అందుకే కొవిడ్ పార్టీకి హాజరయ్యాను అని చివరి క్షణాల్లో బాధపడినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ సోకినప్పటికీ వారిలో ఆక్సిజన్ స్థాయి, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే వారు ఎంత అస్వస్థతకు గురయ్యారోననే విషయం బయటపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. యువకులమనే ధోరణితో ఉండరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయసుల వారిని కొవిడ్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story