ఫుల్లుగా లాగించండి.. సగం బిల్లు చెల్లించండి: రెస్టారెంట్స్ ఆఫర్లు

ఫుల్లుగా లాగించండి.. సగం బిల్లు చెల్లించండి: రెస్టారెంట్స్ ఆఫర్లు

మీ ఇష్టం.. మీకు ఎంత కావాలంటే అంత తినండి.. రోజుకి ఎన్ని సార్లైనా మా రెస్టారెంట్ కి రండి.. బిల్లులో సగం పే చేస్తే చాలండి అని కస్టమర్లను ఊరిస్తున్నాయి రెస్టారెంట్లు.. ఇదేదో బావుంది.. ఎక్కడో తెలిస్తే వెళ్లొచ్చు అనుకునేరు. కొవిడ్ వచ్చి రెస్టారెంట్లని క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. మరేం ఫరవాలేదు.. అన్ని జాగ్రత్తలు తీసుకునే మీకు మంచి భోజనం వడ్డించడమే కాదు.. మీకు వచ్చిన బిల్లులో సగం చెల్లిస్తే చాలు అని బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ ఆఫర్ ఆగస్ట్ నెలకు మాత్రమే వర్తిస్తుంది. సోమ, మంగళ, బుధ ఈ మూడు రోజులు సగం బిల్లు చెల్లించి ఫుల్లుగా లాగించేయొచ్చు. ఏదో ఒక నగరంలో ఈ ఆఫర్ ఉందనుకుంటే పొరపాటే. దేశం మొత్తంలో ఉన్న రెస్టారెంట్లన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

కొవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిని, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వేళ బ్రిటన్‌లోని బోరిస్ ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి తెరతీసింది. దేశం మొత్తం మీద ఎంపిక చేసిన 72వేల రెస్టారెంట్లు, కేఫ్ లు, పబ్బులు ఇలా ఎక్కడికి వెళ్లినా సగం చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్ అని పేరు పెట్టారు. బిర్యానీ తిని బీరు తాగుదామంటే కుదరదు. ఓన్లీ బిర్యానికే ఈ ఆఫర్.. బీరుకి లేదు. ఈ ఆఫర్ కింద ఒక వ్యక్తికి గరిష్టంగా 10 పౌండ్ల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

కరోనా ఆంక్షలు సడలించినా బ్రిటన్ లో వ్యాపారాలు పుంజుకోలేదు. దాంతో ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది. 18 లక్షల మంది చెఫ్ లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలను కాపాడడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చాం అని ఆర్థిక మంత్రి రిషి సునక్ పేర్కొన్నారు. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు ఈ స్కీమ్ కు రూపకల్పన చేయడం విశేషం. ఆగస్టులో వచ్చిన మొదటి సోమవారం కావడంతో రెస్టారెంట్ల వద్ద సందడి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story