రాజధానుల విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్రం షాక్‌

రాజధానుల విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్రం షాక్‌
నిబంధనల ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ క్లారిటీ

ఏపీ విభజన చట్టం నిబంధనలను అనుసరించే 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. చట్టంలోని సెక్షన్‌ 94ను ప్రకారం రాజధాని నిర్మాణం కోసం 2వేల500 కోట్లు ఇచ్చినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. ఏపీ రాజధానిపై చట్టం చేసే శాసనాధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గత మార్చిలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ శ్యామల్‌కుమార్‌ బిత్‌ 14 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో ఏపీ రాజధాని అంశం విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6తో ముడిపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాజధానికి ప్రత్యామ్నాయాల అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదికను తగిన చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని, ఆ తర్వాతే ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94లో కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఉందన్నారు.సీఆర్‌డీఏను రద్దు చేసి, రాష్ట్రంలో మూడు రాజధానులకు వీలు కల్పించే వికేంద్రీకరణ చట్టాలను తెచ్చే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లో ఏపీ విభజన చట్టం, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికల్లోని ముఖ్యాంశాలను జత చేశారు.

Tags

Read MoreRead Less
Next Story