ఏపీ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్

ఏపీ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్
కేబినెట్ విస్తరణపై ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం

ఏపీలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ ముందడుగు వేస్తారా? వెనకడుగు వేస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం సాయంత్రం గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. దీంతో కేబినెట్ విస్తరణపై ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్‌తో మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ చర్చిస్తారని ఆ తర్వాతే కేబినెట్ విస్తరణ కొలిక్కి వస్తుందని వైసీపీలో చర్చ సాగుతోంది.

ఇక మంత్రివర్గంలో చోటు కోసం వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆశావహుల్లో తోటా త్రిమూర్తులు, మర్రి రాజశేఖర్, కవురు శ్రీనివాస్‌లతో పాటు పాత కాపులు పదవులు ఆశిస్తున్నారు. అయితే అసమ్మతి స్వరాలు పెరుగుతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడుతుందా లేక పార్టీలో అసమ్మతిని చల్లార్చేందుకు మరికొందరికి చోటు కల్పిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.

ఈసారి చేపట్టే కేబినెట్‌ విస్తరణలో ముగ్గురి నుంచి ఐదుగురు కొత్త మంత్రులకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉంటుందని వైసీపీలోని కొందరు నేతలు లీకులు ఇచ్చారు. అయితే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేయడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో వైసీపీ అధిష్టానానికి గట్టి షాక్ తగిలింది. దాంతో విస్తరణపై సీఎం జగన్ ఆచితూచి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్పులు చేసినా, చేయకపోయినా ఇబ్బందులు తప్పవని యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదువుల నుంచి తొలగించే వారిని సంతృప్తి పరచడం ఎలా? మార్పులు చేయకపోతే మంత్రి పదువులు ఆశించేవారితో వేగడమెట్లా? అనే డైలమాలో జగన్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కేబినెట్ విస్తరణ.. వైసీపీ అధిష్టానం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

Tags

Read MoreRead Less
Next Story