మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ గళం

మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ గళం
మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు

రాయలసీమ ఐక్య వేదిక కొత్త ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ రాయల తెలంగాణ గళం వినిపింది. విశాఖలో రాజధాని వద్దు.. ఏకైక రాజధానిగా అమరావతినే ఉండాలని చాటిచెప్పారు సీమ నాయకులు. నిన్న కర్నూలు జరిగిన రాయలసీమ కర్తవ్య దీక్షలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. రాయలసీమను తెలంగాణలో విలీనం చేస్తే ఎలాంటి నీటి సమస్య ఉండదన్నారు.

కర్నూలులో రాయలసీమ స్టీరింగ్ కమిటీ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ కర్తవ్య దీక్ష కార్యక్రమం జరిగింది. తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ నేతలు ఐక్య గళం వినించారు. కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సీమ ప్రాంతానికి తీవ్ర నష్టం కలుగుతుందని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జల యుద్ధాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. తాము రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకే కట్టుబడి ఉన్నామని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు.

ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే రాయలసీమకు నష్టమని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం సీమ ప్రాంతానికి ప్రత్యేక నిధుల కేటాయింపులు జరగలేదని తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం ఊసేలేదన్న తులసీరెడ్డి.. తెలుగుగంగ, గాలేరు, హంద్రీనీవా, కేసీ కెనాల్‌ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్లోను కోత పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు నీళ్లు, పరిశ్రమలు, ఉపాధి కోసం ఐక్య ఉద్యమం చేపట్టాలని సీపీఎం నేత గఫూర్‌ పిలుపునిచ్చారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు కలిసి గ్రేటర్‌ రాయలసీమ ఏర్పాటైతే దేశంలోనే ధనిక రాష్ట్రమవుతుందని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఐక్య పోరాటంతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story