విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం.. సీఎం సభకోసం పరీక్షలు వాయిదా

విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం.. సీఎం సభకోసం పరీక్షలు వాయిదా
సీఎం సభకు విద్యార్థులను తరలించడానికి వీలుగా ఏకంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షలను వాయిదా వేశారు

సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం చూపించారు. సీఎం సభకు విద్యార్థులను తరలించడానికి వీలుగా ఏకంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షలను వాయిదా వేశారు. ఇవాళ అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఈ బహిరంగసభకు అనంతపురంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి 800 మంది విద్యార్థులను తరలించాలని అధికారికంగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవాళ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే విద్యార్థులను సభకు తరలించడానికి వర్సిటీ అధికారులు పరీక్షలను వాయిదా వేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి అనంతపురం జేఎన్‌టీయూకి చెందిన అచార్యులే. దీంతో విద్యార్థులను తరలించడంలో ఆయన చొరవ చూపినట్లు తెలుస్తోంది. వసతి దీవెన లబ్ధిదారులైన విద్యార్థులంతా బహిరంగ సభకు రావాల్సిందేనని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను పాఠశాలలకు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యాలు సూచించాయి. మరోవైపు నార్పలలో సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే దారిలో 2కిలో మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story