అమ్మకానికి అమరావతి భూములు

అమ్మకానికి  అమరావతి భూములు
రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం

అమరావతి రాజధాని భూములపై ప్రభుత్వం కన్ను పడింది. రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే ఆగిపోయాయి. దీంతో వేల కోట్ల పనులు నిరుపయోగంగా మారాయి. సగంలో ఆగిన భవన నిర్మాణాలు, రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ తరుణంలో అమరావతిలో 14 ఎకరాల భూములను ఈ-వేలం ద్వారా అమ్మడానికి గుంటూరు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ధర నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలందరితో ముడిపడి ఉన్న రాజధాని అంశాన్ని తేల్చకుండా భూములు అమ్మడమేంటని రైతులు నిలదీస్తున్నారు. రాజధాని ప్రాంతం మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ- గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే ఉన్న నవులూరు వద్ద 10 ఎకరాలు విక్రయించనున్నారు. ఇక్కడ ఎకరం ధర 5 కోట్ల 94లక్షల 50వేలుగా నిర్ణయించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కనే పిచ్చుకలపాలెం వద్ద నాలుగు ఎకరాలు విక్రయిస్తారు. ఎకరం ధర 5 కోట్ల 41లక్షల 4వేల 400 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రెండు భూములూ అత్యంత విలువైనవి. ధరలు నిర్ణయం కావడంతో ఈ-వేలంలో అమ్మేందుకు సీఆర్‌డీఏ పూర్తి వివరాలతో త్వరలోనే ప్రకటన ఇవ్వనుంది.

Tags

Read MoreRead Less
Next Story