CBN ARREST: ముక్తకంఠంతో ఖండించిన అఖిలపక్షం

CBN ARREST: ముక్తకంఠంతో ఖండించిన అఖిలపక్షం
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అఖిలపక్ష భేటీ... వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టాలని పిలుపు

నిరంకుశ విధానాలతో ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని 2024లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. విజయవాడలో జైభీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యాన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు సహా ఇతర పార్టీల ప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు సహా వైకాపా ప్రభుత్వ వైఖరిని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. వైసీపీని తరిమికొడితేనే ఏపీలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని అన్నిపార్టీలు స్పష్టం చేశాయి. జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గిట్టదని, మరే రాజకీయ పార్టీ ఉండకూడదన్నట్లు అరాచకాలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన దమనకాండ... చంద్రబాబు అరెస్టుతో పరాకాష్టకు చేరిందన్నారు.


జగన్‌ అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలతో పాటు ప్రతిపక్షాలపై దమనకాండను ఇప్పటికే ప్రజలకు వివరించామని తెలుగుదేశం నేత పట్టాభి తెలిపారు. స్కిల్‌ కేసులో వాస్తవాలు తెలియజేసేందుకు ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటుచేశామని, ప్రజెంటేషన్‌లు ఇచ్చామని అన్నారు. పెద్దన్నపాత్ర పోషిస్తూ మిగిలిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతామని స్పష్టంచేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని జనసేన, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జగన్‌ 786 విధాన నిర్ణయాలు తీసుకున్నారని, 28వేల జీవోలు ఇచ్చారని 2024లో అధికారం మారిన తర్వాత జగన్‌ కూడా విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

అఖిలపక్ష సమావేశంలో 5 తీర్మానాలు ఆమోదించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఓ తీర్మానం, కేసులో కేంద్రం జోక్యం చేసుకుని శాంతిభద్రతలను కాపాడాలని మరో తీర్మానం ప్రవేశపెట్టారు. వచ్చే శనివారం గవర్నర్‌ను కలిసి విపక్షాలపై ప్రభుత్వ దమనకాండను వివరించాలని, సమయం ఇస్తే రాష్ట్రపతిని కలిసి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story