అమరావతి కోసం ఎందాకైనా పోరాటం : అన్నదాతలు

అమరావతి కోసం ఎందాకైనా పోరాటం : అన్నదాతలు
అమరావతి కోసం ఎందాకైనా పోరాటం : అన్నదాతలు

అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 257వ రోజూ పోరాటాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించారు. వైసీపీ సర్కారు వైఖరిపై రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్నారు. అమరాతే రాజధాని అని ప్రకటించేవరకు ఎందాకైనా పోరాటానికి సిద్ధమని అన్నదాతలు తేల్చిచెబుతున్నారు. అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు మహిళలు పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని మొక్కుకున్నారు. ప్రభుత్వం పంతానికి పోకుండా రైతులు ఇచ్చిన భూముల్ని అభివృద్ధి చేయాలని వారన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు అమరావతికి మద్దతు పలికారని గుర్తుచేశారు.

అడుగడుగునా తమ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై మండిపడుతున్నారు రైతులు. ఇటీవలే ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించారు. 144 సెక్షన్‌ నేపథ్యంలో టెంటు వేయొద్దని హెచ్చరించారు. అయితే, పోలీసులు టెంటు తొలగించడంతో రైతులు మరో టెంట్ వేశారు. దీన్ని తీసేయాలంటూ పంచాయతీ సిబ్బంది మైక్‌లో ప్రచారం చేశారు. అనుమతి లేకుండా రాజధాని గ్రామాల్లో సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని హెచ్చరించారు. పోలీసుల తీరుపై రాజధాని రైతులుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా వేధింపులు ఏంటని రైతులు మండిప్డారు. పోలీసులు, పంచాయతీ సిబ్బంది తీరుకు నిరసనగా ఎండలో పడుకుని నిరసన తెలిపారు. మహిళలు గొడుగులు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేపట్టారు.

తుళ్లూరు, వెలగపూడి, మందడం, బోరుపాలెం, పెదపరిమి, దొండపాడు, అనంతవరం తదితర గ్రామాల్లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం పచ్చని పంట పొలాల్ని త్యాగం చేసిన తమను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అన్నదాతలు మండిపడ్డారు. తాము ఎలా ఇచ్చామో.. ఇప్పుడు ఆ భూములు తిరిగి అలానే ఇవ్వాలని రాజధాని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతిలో పెట్టాలని ఆ రోజు తాము అడగలేదని, ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చామన్నారు. ప్రతిపక్ష నేతగా ఆనాడు రాజధానిని ఒప్పుకున్న సీఎం జగన్‌.. ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మొత్తంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. అమరాతే రాజధాని అని ప్రకటించేవరకు ఎందాకైనా పోరాటానికి సిద్ధమని అన్నదాతలు తేల్చిచెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story