Anantapur: పోలీస్ స్టేషన్‌పై పడి దాడి చేసిన వైసీపీ కార్పొరేటర్‌

Anantapur: పోలీస్ స్టేషన్‌పై పడి దాడి చేసిన  వైసీపీ కార్పొరేటర్‌
మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన, ఆమె డ్రస్‌ లాగి స్టేషన్‌ బయటకు ఈడ్చిన వైసీపీ నేతలు


అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా స్పెషల్ ఎన్‌ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ పైనే దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సెబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు.. అతనిపై కేసు నమోదు చేయకూడదని పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వీరంతా అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

అనంతపురంలోని నవోదయకాలనీకి చెందిన గుజ్జల సురేశ్‌ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు సెబ్‌ పోలీసులు. ఆయన నుంచి 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలోని 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌, మరో కార్పొరేటర్‌ కమల్‌ భూషణ్‌ సుమారు పాతిక మందితో కలిసి గుల్జార్‌పేటలోని సెబ్‌ స్టేషన్‌కు వెళ్లి వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే మనుషులమని, కార్పొరేటర్లమంటూ హల్‌చల్‌ చేశారు. సురేశ్‌పై కేసు నమోదు చేయకూడదని హుకుం జారీ చేశారు. అయితే పోలీసు అధికారులతో మాట్లాడుకోవాలని సిబ్బంది సూచించినా పట్టించుకోలేదు.




కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్ అయితే... ‌ ఏకంగా ఎస్‌ఐ కుర్చీలో కూర్చున్నాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై వాదనకు దిగాడు. ఇది పబ్లిక్‌ ప్రాపర్టీ అని, ఎక్కడైనా కూర్చోవచ్చని వాదించాడు. స్టేషన్‌కు మరింతమంది అనుచరులు రావడంతో రెచ్చిపోయారు వైసీపీ నేతలు. వాదనకు దిగిన చంద్రశేఖర్‌ను ‘ఎందుకలా అరుస్తున్నావ్‌..? అని మహిళా కానిస్టేబుల్‌ రాధ ప్రశ్నించారు. ఇదే సమయంలో మధ్యలోకి వచ్చిన ఎస్‌ఐ మునిస్వామిపై చేయి చేసుకున్నారు. ఆయన్నుకిందకు తోసేశారు. మహిళా కానిస్టేబుల్‌ రాధ వారిని పక్కకు పంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మద్యం విక్రేత సురేశ్‌ తండ్రి ఆమె డ్రస్‌ లాగాడు. ఆమె తలపై దాడి చేశాడు. దీంతో ఆమె వారిని పట్టుకుని స్టేషన్‌లోకి లాక్కువెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెను సైతం తోసేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌ అడ్డుకోవడంతో ఆయనపైనా దాడి చేశారు. తమను స్టేషన్‌ నుంచి బయటకు లాక్కొచ్చారని రాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా డ్యూటీ చేస్తారో చూస్తాం. బయటకు రాకుండా ఉంటావా?’ అని బెదిరించారు.వైసీపీ నాయకుల అనుచరులతో పాటు స్టేషన్‌కు వార్డు వలంటీర్లు హర్షవర్ధన్‌రెడ్డి, నూర్‌మహమ్మద్‌, అనిల్‌కుమార్‌, ఆర్యవర్ధన్‌ కూడా వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.




Tags

Read MoreRead Less
Next Story