AP: పాలకులకు పట్టని అంగన్‌వాడీల ఆందోళన

AP: పాలకులకు పట్టని అంగన్‌వాడీల ఆందోళన
16 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరు.... నిరసనకారులతో ఫోన్లో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ

పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే పాలకులకు పట్టడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో కనీస స్పందన లేదని మండిపడ్డారు. సర్కార్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంలో చలనం లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. నిరసనకారులతో బాలకృష్ణ ఫోన్లో మాట్లాడి మద్దతుగా ఉంటామని భరోసా కల్పించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయల్దేరిన అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.


Y.S.R జిల్లా బద్వేలులో ఎమ్మెల్యే సుధ ఇంటి వద్ద వినతిపత్రాన్ని ఉంచి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కొండాపురంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు చుట్టుముట్టారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి నివాసం వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగించారు. డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఇళ్ల వద్ద నిరసన తెలిపారు. మంత్రి సురేష్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద గేటుకు వినతి పత్రం కట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. నందిగామలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కార్యాలయం వద్ద అంగన్వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంగన్వాడీలతో దురుసుగా ప్రవర్తించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులపై పరుష పదజాలంతో రెచ్చిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story