AP: ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

AP: ఏపీ  ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
పంచాయతీ నిధుల మళ్లింపుపై కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులను మళ్లించడం. తిరిగి జమ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయతీ నిధుల మళ్లింపుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్‌ వేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు 7వేల 659 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర పంచాయతీ పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎం.రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో పాటు కొందరు సర్పంచులు గత ఏడాది ప్రజాహిత వ్యాజ్యం వేశారు. విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. విద్యుత్‌ బిల్లు బకాయిల సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించిందన్నారు. దీనివల్ల అభివృద్ధి పనులకు పంచాయతీల వద్ద సొమ్ము లేకుండాపోయిందని తెలిపారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో న్యాయస్థానం ఆదేశించినప్పటికి, చేయలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story