AP: కోర్టు తీర్పు పక్కన పెట్టి.. మూడు రాజధానుల "పాట" పట్టి

AP: కోర్టు తీర్పు పక్కన పెట్టి.. మూడు రాజధానుల పాట పట్టి
వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానుల పేరిట ఊదరగొడుతూనే ఉన్నారు

అమరావతిని అటకెక్కించిన జగన్‌ సర్కారు మూడు రాజధానులంటూ మొదలుపెట్టిన సీఎం జగన్‌ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అంటూ మూడు రాజధానుల ముచ్చట గురించి అసెంబ్లీలో వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులోనూ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అని ప్రస్తావించారు. వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానుల పేరిట ఊదరగొడుతూనే ఉన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉండటంతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకున్నారు.

రాజధాని రైతులతో కుదిరిన చట్టబద్ధ ఒప్పందాలు, రాష్ట్ర విభజన చట్టం, ఇతర నిబంధనల దృష్ట్యా అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. రాజధాని అభివృద్ధికోసం హైకోర్టు విధించిన గడువులపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. వెరసి ఏ రకంగా చూసినా ఇప్పుడు రాష్ట్రానికి అమరావతే రాజధాని. రాష్ట్రస్థాయి కార్యాలయాలేవీ ఇక్కడి నుంచి తరలించేందుకు వీల్లేదు. పైగా అమరావతే రాజధాని అని చెప్పిన తర్వాత కూడా పాదయాత్రలు, ర్యాలీలు ఏమిటని హైకోర్టు ఒక సందర్భంలో మండిపడింది. అయినా సరే మంత్రులు, నేతలు 'త్వరలో విశాఖకు. ఏప్రిల్‌లో విశాఖకు, కొన్ని నెలల్లో విశాఖకు' అని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన 'పాలన విశాఖ నుంచే జరుగుతుంది. అదే రాజధాని అని బెంగళూరు వేదికగా చెప్పేశారు. ఆయన పక్కనే ఉన్న మంత్రి అమర్నాథ్‌ సైతం 'కొన్ని నెలల్లో విశాఖ రాజధాని అవుతుంది' అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story