రెండో రోజు వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు.. విపక్ష ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం

రెండో రోజు వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు.. విపక్ష ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా టీడ్కో ఇళ్లు, పేదల ఇళ్ల స్థలాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడ్కో ఇళ్ల పంపిణీ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. దీంత స్పీకర్ తమ్మినేని అసహనానికి గురై.. విపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడనంటూ వ్యాఖ్యానించారు.

టిడ్కో ఇళ్లతోపాటు..టీడీపీ అధినేత చంద్రబాబు... రైతుల నష్ట పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పరిహారంపై ప్రభుత్వం సమాధానం ఇచ్చేవరకు నిల్చొనే ఉండి నిరసన తెలుపుతానన్నారు. ఉదయం సభ ప్రారంభం అయినప్పటి నుంచి... మొదటి వాయిదా పడే వరకూ ఆయన నిలబడే ఉన్నారు. ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై తాము మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటే తమకు కనీసం మైక్ ఇవ్వడం లేదన్నారు.

అనంతరం టీడ్కో ఇళ్ల అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టిడ్కో గృహాలు ఇప్పటి వరకు లబ్దిదారులకు పంపిణీ చేయలేదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఈ మధ్య పేపర్స్ లో ఇచ్చిన ప్రకటనపైనా బాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో చంద్రబాబు స్కీమ్‌లు, జగన్‌ స్కీమ్‌లంటూ ఉండవని ఎద్దేవా చేశారు.

పేదలపై వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్లు వేసుకోవడమేంటి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన్ స్టీకర్ల సీఎంగా మిగిలిపోతారని విమర్శించారు. పేదలకు ఒక్క సెంటు స్థలాల్లో ఇళ్లు కట్టించి మురికికూపాలుగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేదలంటే మీకు ఎందుకంత కోపమని దుయ్యబట్టారు.

టీడ్కో ఇళ్లపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహనరావు, ఆనగాని సత్యప్రసాద్, బాలావీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ, ఆదిరెడ్డి భవాని, గొట్టిపాటి రవి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. మొత్తమ్మీద రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story