AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం
మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు.

స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు... పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని నినదించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. దగా ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అని నినదించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో, ఈరోజుకి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే స్పీకర్ జీరో అవర్ ను ప్రారంభించారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, వెంకటరెడ్డి నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. టీడీపీ సభ్యులు నిన్న కూడా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8.30గంటల సమయంలో సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2024-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి మండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు , డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టకల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, నంద్యాల జిల్లా డోన్ లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ఏపీ శాసనసభలో ఈనెల 5న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story