AP CM Jagan: సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న ఏపీ

AP CM Jagan: సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న ఏపీ
త్వరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతోందన్న సీఎం

ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సులో ఏపీ సీఎం జగన్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతోందన్నారు. రాజధాని కాబోతున్న విశాఖకు రావాలని అందర్నీ కోరుతున్నానన్నారు. కొన్ని నెలల్లో తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని జగన్‌ పేర్కొన్నారు. దీంతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ భగ్గుమంటోంది. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతోందని జగన్ చెప్పడంపై ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. న్యాయనిపుణులు, ప్రతిపక్షాలు, రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాజధానిపై జగన్ ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని మోసపూరిత ప్రభుత్వం అంటూ న్యాయనిపుణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ చట్టాలను గౌరవించడం లేదని హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ వ్యక్తిగత అభిప్రాయమా? లేక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక సీఎంగా మాట్లాడారా? అనేది చెప్పాలన్నారు. ఇది పక్కాగా ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని హైకోర్టు అడ్వకేట్ జడ శ్రవణ్‌కుమార్ స్పష్టంచేశారు. ఆల్రెడీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజధానిని తరలించే అధికారం శాసనసభకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందన్నారు. రాజకీయ లబ్దికోసం మూడు ప్రాంతాల్లో జగన్, మంత్రులు మూడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను గందరగోళం చేయడానికే సీఎం జగన్ వ్యాఖ్యలని విమర్శించారు. అటు సీఎం జగన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. సుప్రీంకోర్టును కూడా జగన్ గౌరవించడం లేదని ధ్వజమెత్తారు. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. విశాఖ రాజధాని అని జగన్ అనడం నిరంకుశ వైఖరికి పరాకాష్ట ఫైర్ అయ్యారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ వ్యాఖ్యలు చేసారని దుయ్యబట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని గుర్తుచేశారు. మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని చెప్పారు.సుప్రీంకోర్టులో రాజధానిపై కేసు నడుస్తుండగా జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ నియంత పాలనకు నిదర్శనమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధాని అమరావతి అని ఒప్పుకున్నారని గుర్తుచేశారు. జగన్ కోర్టు ధిక్కరణను ఎదుర్కోకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసును డైవర్ట్ చేయడానికే జగన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story