ఏపీలో అప్పుల కుప్పగా ఆర్థిక పరిస్థితి!

ఏపీలో అప్పుల కుప్పగా ఆర్థిక పరిస్థితి!
ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారువుతోందా...? పరిస్థితి చూస్తుంటే అప్పుల కుప్పగా..

ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారువుతోందా...? పరిస్థితి చూస్తుంటే అప్పుల కుప్పగా మారేలా ఉంది. ఈ నెల ఉద్యోగుల జీతాలు, పింఛన్లు కూడా చెల్లించడానికే.. తీవ్రంగా ఇబ్బంది పడింది ఏపీ ప్రభుత్వం. చివరికి.. రిజర్వు బ్యాంక్‌లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 3 వేల కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుని 2 లక్షల మందికి జీతాలు, పింఛన్లు చెల్లించారు. ఇలాంటి పరిస్థితుల్లో... కాగ్ నివేదికలో.. ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే... 39 వేల 946 కోట్లు అప్పు చేశారని.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ట్వీట్ చేశారు. 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో ఈ అప్పులు 83 శాతమన్నారు. అంటే.. మొదటి నాలుగు నెలల్లోనే భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.. మన నయా అప్పుల రాజా జగన్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో.. అదనంగా 6 వేల 645 కోట్లు అప్పు చేసినట్టు కాగ్‌ నివేదికలో వెల్లడైందన్నారు పట్టాభి. నాలుగు నెలల్లో... 39 వేల 946 వేల కోట్లు అప్పు చేయగా... అంతకు ముందు.. అప్పులు 63 వేల 817 కోట్లు. అంటే మొత్తం అప్పులు ఒక లక్షా 3 వేల 763 కోట్లకుచేరుకున్నాయి. కరోనా పరిస్థితుల్లో... ప్రభుత్వానికి ఆదాయం లేక... అనేక సంక్షేమ పథకాలకు నిధుల కటకట ఏర్పడింది. రెవెన్యూ పూర్తిగా పడిపోవడంతో రాష్ట్ర అర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి సందర్భంలో ... పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, పింఛన్లకు కూడా నిధులు కేటాయించిలేని స్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాగానే... రెవెన్యూతో సంబంధం లేకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. ప్రస్తుతం వాటికి నిధులు సమకూర్చడం ప్రభుత్వానికి పెద్ద సవాలే.

ఏడాదికి 250 రూపాయల చొప్పున పింఛన్లు పెంచుతామని అధికారంలోకి రాగానే సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో... పింఛన్లు పెంచితే వాటికి నిధులు ఎలా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కోవిడ్‌ పరిస్థితుల్లో.. ఈ నెల మాదిరిగానే వచ్చే నెల కూడా జీతాలు, పింఛన్లకు కటకట ఏర్పడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా దిగజారుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదాయం కంటే ఖర్చులే అధికమై ఏపీ ప్రభుత్వం తన ఖాతాలో RBI వద్ద ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రుణాలను తిరిగి చెల్లించగల స్థోమత ఏంటనేదే ఇక్కడ కీలకాంశం.

ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామిక, సేవా రంగాలు గతంలో పోల్చితే ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి అంతగా జరగలేదనేది నిపుణుల మాట. అలాగే టీడీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక పరిశ్రమలు కూడా కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలు చూసి వెనక్కి తగ్గడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు.. మార్కెట్‌లో ఏపీ అంటే నమ్మకంలేని స్థితికి తీసుకెళ్లాయి కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని TDP సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ఏపీలో పారిశ్రామికభివృద్ధి జరిగి ఖజానాకు ఆదాయం పెరగడం ఇప్పట్లో కనిపించేలా లేదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం తీసుకుంటున్న రుణాల చెల్లింపు ఎలా అనేది సమస్య ఒక ఎత్తయితే... భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నిధులను సమీకరించడం ఎలా అనేది మరో సమస్య. FRBM చట్టం విధించే పరిమితులతో పాటు, ప్రస్తుతం పేరుకుపోయిన రుణాలను చెల్లించలేని స్థితి కూడా ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే కాలంలో రాష్ట్రం పూర్తిగా దివాళా తీయొచ్చని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు ఆదాయం పెరగకపోగా.. సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ఖజానాపై గుదిబండగా మారుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న అప్పులు... రాష్ట్ర భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story