CM Jagan : మరో భారీ అప్పుకు జగన్‌ సర్కార్‌ రెడీ

CM Jagan : మరో భారీ అప్పుకు జగన్‌ సర్కార్‌ రెడీ
విద్యుత్‌ ఉద్యోగులనిధుల నుంచి రూ.11,600 కోట్ల అప్పుల వేట

ఏపీ సర్కార్‌ మరో భారీ అప్పు చేసేందుకు రెడీ అవుతుంది. దాదాపు 11 వేల 600 కోట్ల అప్పు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జీరో కూపన్‌ బాండ్లు జారీచేసి ఈ అప్పు తెచ్చేందుకు సిద్ధమైయ్యారు. ఇందు కోసం కమీషన్‌ తప్ప మరే ఆదాయం లేని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి ఏకంగా ఏఏ+ రేటింగ్‌ ఇప్పించుకుంది జగన్‌ సర్కార్‌. అది కూడా ఎవరికి తెలియని అక్యుటీ అనే సంస్థతో ఈ రేటింగ్‌ ఇప్పించుకుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏపీసీఆర్‌డీఏ బాండ్లు, పీఎఫ్‌సీ బాండ్లు, ఏపీసీపీడీసీఎల్‌ బాండ్లు, ఇతర ఎనర్జీ సంస్థలకు చెందిన బాండ్లన్నీ డిఫాల్ట్‌ అయ్యి మార్కెట్లో బీ రేటింగ్‌తో ట్రేడ్‌ అవుతుండగా.. ఇప్పుడు అదే ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లకు ఏఏ+’రేటింగ్‌ కచ్చితంగా రాదని... కానీ ఆ రేటింగ్‌ సంస్థ ఇచ్చింది, అది చూపించి ప్రభుత్వం మార్కెట్లో బాండ్లు జారీ చేస్తూ ఇన్వెస్టర్లను మోసం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు ఈ నెల 14న బాండ్లు జారీ చేసి ముందుగా రెండువేల కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్‌ను బట్టి, వడ్డీ రేటు తక్కువకు వస్తే ఇంకో 9వేల600 కోట్లు తీసుకునేలా గ్రీన్‌ షూ ఆప్షన్‌ పెట్టుకున్నారు.బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం జారీ చేయాలనుకుంటున్న జీరో కూపన్‌ బాండ్లు చాలా రిస్కీ అని, పెట్టుబడులు సురక్షితం కాదని, ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ బాండ్లపై ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించే అవసరం ఉండదు కాబట్టే, కంపెనీలు,ప్రభుత్వాలు వీటిని జారీ చేస్తుంటాయని, వీటికి లాంగ్‌టర్మ్‌ మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుందని తెలిపారు. మార్కెట్లో జీరో కూపన్‌ బాండ్లకు డిమాండే ఉండదని, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ బాండ్లకు అస్సలు ఉండదని ఆర్ధిక నిపుణలు అంటున్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు ఇన్వెస్టర్లు కరువయ్యారు కాబట్టే, ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్ము, విద్యుత్‌ సంస్థల డిపాజిట్లను ఆ బాండ్లలోకి మళ్లిస్తోందని, కొందరు ప్రైవేటు ఇన్వెస్టర్లను ఏర్పాటు చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈపీఎఫ్‌వో మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల డబ్బును ఇంతటి ప్రమాదకరమైన పెట్టుబడి సాధనల్లో పెట్టకూడదు. కానీ, ఏఏ+ రేటింగ్‌తో అటు సెబీ, ఇటు ఈపీఎఫ్‌వో కళ్లుగప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిపుణులు అంటున్నారు.

మరోవైపు ప్రభుత్వం తరపున జీరో కూపన్‌ బాండ్లు జారీ చేస్తున్న ట్రస్ట్‌ కేపిటల్‌ అడ్వైజర్స్‌ సంస్థకు ప్రభుత్వం ఫీజు కింద 1.5శాతం చెల్లిస్తోందని సమాచారం. అందుకే ఆ సంస్థ ఏదో రకంగా బాండ్లు జారీచేసి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు లాక్కొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరహా బాండ్లు ఈ సంస్థ ఒక్కటే విడుదల చేస్తోందని, ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో అమ్ముకోవాలనుకుంటే పైసా కూడా పుట్టదని, తిరిగి అదే సంస్థకు అమ్ముకోవాల్సి ఉంటుందని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.ఈ తరహా బాండ్లకు మార్కెట్లో లిక్విడిటీ అనేది ఉండదని,ఈ బాండ్లు ట్రేడింగ్‌ జరగవని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story