జేఏసీ అధ్యక్షుడు బండిపై ఉద్యోగులు గుర్రు

జేఏసీ అధ్యక్షుడు బండిపై ఉద్యోగులు గుర్రు
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెట్టబోతున్నారని... అందుకే ఈ భజనంటూ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

సూపర్‌.. బంపర్‌ అంటూ సీఎం జగన్‌ను పొగడ్తల వర్షంలో ముంచేసిన ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుపై ఉద్యోగ వర్గాలు పీకలల్లోతు కోపంతో ఉన్నాయి. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెట్టబోతున్నారని... అందుకే ఈ భజనంటూ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. సీఎంతో ఉద్యోగ నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. పోటీలు పడి మరీ.. ఈ భేటీలో జగన్‌ను ఉద్యోగ నేతలు పొగిడేశారు. అయితే, బండి మాత్రం భజనే చేశారు. అయితే, ఈ భేటీకి ముందే పదవి విషయంలో ప్రభుత్వ పెద్దలతో ఆయనకు ఒప్పందం కుదిరిందని.. అందుకేనా జగన్‌ భజన అంటూ ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బండి శ్రీనివాసరావు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో పదవీ విరమణ తర్వాత కూడా ఏదో ఒక పదవిలో కొనసాగేలా స్కెచ్‌ వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పదవి భరోసాతోనే లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి... బండి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమ సంఘ నేతలు ఇంతలా దిగజారిన సందర్భాలు లేవని మండిపడుతున్నారు.

కేబినెట్‌ నిర్ణయాలను సమర్థిస్తూ సీఎం జగన్‌ను ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు పొగడ్తలతో ముంచెత్తడంపై యూటీఎఫ్‌ మండిపడింది. ఆయన మాట్లాడిన తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలపై ఏపీ జేఏసీలో చర్చించకుండా.. సంఘాల అభిప్రాయం తీసుకోకుండా ఉద్యోగులు, జేఏసీ సంతృప్తిగా ఉన్నాయని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని బండి శ్రీనివాసరావును ప్రశ్నించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ లేఖ రాశారు. ఏపీ జేఏసీలో యూటీఎఫ్‌ భాగస్వామిగా ఉంది.

సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ ప్రతిపాదించడం వల్ల సీపీఎస్‌ ఉద్యోగులు ఎవరు సంతృప్తిగా లేరని... అలాంటప్పుడు సీఎం జగన్‌ను కలిసిన సమయంలో జీపీఎస్‌ను చాలా గొప్ప పథకంగా అభివర్ణించడమేంటని ప్రశ్నించారు. గత పీఆర్సీ బకాయిలు చెల్లించకుండానే కొత్త పీఆర్సీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటి? కొత్త పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? వాటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అన్న విషయలపై స్పష్టత లేకుండానే హర్షం వ్యక్తం చేశారని అభ్యంతరం చెప్పారు. 2014జూన్‌ 2నాటికి ప్రభుత్వ విభాగాల్లో 10 వేల 117మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మంత్రివర్గం నిర్ణయం ప్రకారం కేవలం 6 వేల 666 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అవుతారని... మిగిలిన వారి పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకుండానే బండి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడంపై అభ్యంతరం చెప్పారు.

జేఏసీ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి, జరిగిన పరిణామాలపై చర్చించాలని యూటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. భాగస్వామ్య సంఘాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని, సమస్యల కార్యాచరణ ప్రకటించాలని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని కోరితే... జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ముందుకు వెళ్దామన్నారని.. ఎన్జీవో సంఘం సమావేశం తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలను జేఏసీలో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story