ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్..కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్..కోర్టు తీర్పుపై ఉత్కంఠ
ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య వరుస వివాదాలు, న్యాయస్థానాల్లో విచారణల నేపథ్యంలో.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

తుదిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యే వరకు..... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని.. డీజీపీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య వరుస వివాదాలు, న్యాయస్థానాల్లో విచారణల నేపథ్యంలో.. .. నెలకొంది. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారని పెద్దిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

అటు.. ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో.. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఫలితాల్ని ప్రకటించవద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాలు పాటిస్తే కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడాన్ని.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ముగిసే వరకు మంత్రిని నివాసానికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియపైనా, శాంతిభద్రతలపైనా ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు మంత్రిని మీడియాకు కూడా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.

మీడియా ద్వారా మంత్రి చేసిన హెచ్చరికలు జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారుల్లో రేకెత్తించిన భయాందోళనల్ని తొలగించేందుకు.. ఎన్నికల్ని స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, చట్టాలకు లోబడి ఎన్నికల విధులు నిర్వర్తించేలా చూడటమే ఎన్నికల సంఘం విధి అని తెలిపారు.

'రాష్ట్ర ప్రజలు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు కొన్ని పరిమితులు విధించాలన్న, ఉద్దేశంతోనే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వైద్యం, ఇతర అత్యవసర పనుల నిమిత్తమైతే మంత్రిని ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించవచ్చని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అటు.. కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగుల్లో గర్భిణులు, 50 ఏళ్లు పైబడిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. తనను కలిసి విజప్తి చేయగా.. ఎస్‌ఈసీ సానుకూలంగా స్పందించారు.

పంచాయతీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలంటూ తాను ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలియజేశారు. తాను అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అందుకు దారితీసిన కారణాలను వివరించారు. ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు అభద్రతా భావనకు గురికాకుండా పని చేయాలని రమేశ్‌కుమార్‌ ప్రకటించారు.

అటు.. అధికారుల్ని బెదిరించడం సరికాదని.. ఎస్‌ఈసీ ఆగ్రహించినా మంత్రి పెద్దిరెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు. అధికారులు తమ పరిధిని దాటి ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. ఈ విషయాన్ని నిన్న చెప్పాను, నేడు చెబుతున్నా.. రేపూ ఇదే చెబుతా అంటూ మరోసారి హెచ్చరించారు. తాను మాట్లాడిన దానికంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వెయ్యిరెట్లు ఎక్కువగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story