ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించిన నైరుతి రుతు పవనాలు... నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు.... తెలంగాణలోనూ దంచికొట్టనున్న వాన... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు....

రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించినట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.... రుతు పవనాలు వేగంగా విస్తరించేందుకు దోహదపడినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ వివరించింది. ఉపరితల ఆవర్తనం, రుతు పవనాల ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి,అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కూడా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో అత్యధికంగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా... పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ధూళిపాళ్లలో 62, చాగల్లులో 59.5, ముప్పాళ్లలో 46 మిల్లీమీటర్ల వర్షంకురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల విస్తరణతో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ ప్రకటనలతో ఖరీఫ్‌ పనులు జోరందుకుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story