Teachers Dharna : ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా

Teachers Dharna : ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
పెండింగ్‌ బకాయిల చెల్లింపు కోసం

బకాయిలు చెల్లించకుండా ఉపాధ్యాయులను రోడ్డుకు ఈడ్చిన ముఖ్యమంత్రి జగనని A.P.T.F నేతలు మండిపడ్డారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ A.P.T.F ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టారు. వారం రోజుల్లో C.P.S రద్దు చేస్తామని నమ్మబలికి....ఐదేళ్లపాటు కాలయాపన చేసి చివరికి జీపీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చి తమ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సమస్యలను జులైలో పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెబుతున్న మాటలకు ఎంతవరకు విశ్వసనీయత ఉందని A.P.T.F నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ధర్నాకు దిగారు. టీచర్ల నియామకంలో ప్రవేశపెట్టిన అప్రెంటీస్‌షిప్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని... లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దుపై అబద్ధపు హామీలతో ఉద్యోగులను వంచించడమే కాక 117 జీవోను తీసుకొచ్చి విద్యావ్యవస్థను జగన్‌ ముక్కలు చేశారని కనిగిరిలో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్‌ గాలికొదిలేశారని అనంతపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘ నాయకులు మండిపడ్డారు. రౌడీలను నాయకులుగా పెట్టుకుని నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉపాధ్యాయులు ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనలో మాట్లాడేందుకు మైక్‌ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో.. మైక్‌ లేకుండానే నాయకులు గోడు వెళ్లబోసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story