అరకులో శీతాకాల అందాలు..పసుపు చీర కట్టుకున్న పెళ్లికూతురులా ముస్తాబు!

అరకులో శీతాకాల అందాలు..పసుపు చీర కట్టుకున్న పెళ్లికూతురులా ముస్తాబు!

ఆంధ్రా ఊటీ అరకు పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రధానంగా.. వలిసే పూలతో.. శీతాకాలపు అందాలు కనువిందు చేస్తున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ పూలను సాగుచేస్తారు గిరిజన రైతులు. నవంబర్ వచ్చేసరికి పసుపు చీర కట్టుకున్న పెళ్లికూతురులా ముస్తాబవుతుంది ఇక్కడి ప్రాంతం. అరకు అందాలు అని చెప్పుకోవడమే గాని అక్కడికి వెళ్తే ఏమేముంటాయని అడిగితే.. ప్రధానంగా చెప్పుకునేది ఈ పసుపు పూలనే. ఈ అందాలను బంధించడానికి కెమెరాలు కూడా పోటీపడుతుంటాయి. అందుకే, ఈ కాలంనే ఇక్కడ సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి.

మంచు తెరలను చీల్చుకుంటూ చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అరకుకు శీతాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉండడానికి కారణం అదే. ఆ ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేది మాత్రం ఈ వలిసె పూల అందాలు. పసుపు వర్ణంతో సింగారాలుపోయే ఈ అందాలను చెప్పతరం కాదు. చలికాలం.. అందునా కరోనా ఉన్నా సరే పర్యాటకులు ఏమాత్రం తగ్గడం లేదు. మరో సీజన్‌లో ఈ అందాలు ఉండవన్న కారణంగా పర్యాటకుల రాక కూడా పెరిగింది. అరకు అందాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అందుకే, మళ్లీ మళ్లీ వస్తుంటామని చెబుతుంటారు పర్యాటకులు.అరకు లోయలో మంచు తెరలు, వలిసె పూల అందాలే కాదు జలపాతాలు కూడా మరింత వన్నె తెస్తున్నాయి. ప్రకృతి సొగసులు చూసి అలసిపోయే పర్యాటకులను చాపరాయి జలపాతం సేదతీరుస్తుంది. విశాఖకు వెళ్లినప్పుడు.. కచ్చితంగా ఈ అందాలు చూడాల్సిందేనంటున్నారు పర్యాటకులు.

Tags

Read MoreRead Less
Next Story