Asha workers: ఆశా కార్యకర్తల పోరుబాట

Asha workers: ఆశా కార్యకర్తల పోరుబాట
ఆల్‌ ఇన్‌ వన్‌గా వాడుకుంటూ అరకొర జీతాలు

కనీస వేతనాలు చెల్లించాలంటూ రెండో రోజూ ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. 36 గంటల ధర్నాలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. చాలా చోట్ల పోలీసులు, ఆశా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఉద్యమిస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని మహిళలు మండిపడ్డారు.

శ్రీకాకుళంలో ఆశా వర్కర్ల 36 గంటలు ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా మినీ లారీల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ముట్టడికి ఆశాలు సిద్ధమైనట్లు తెలిసి.... ముందుగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఆశాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. RTC కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ఆశా వర్కర్లు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ G.V.M.C గాంధీ పార్కు వద్ద 36 గంటల మహాధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలను... పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతుంటే... పోలీసులు ఉక్కుపాదం మోపడం దారుణమని ఆశాలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాకినాడ జిల్లాలోనూ ఆశ వర్కర్ల 36 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల పైన పనిభారం తగ్గించాలని... కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌కు భారీగా ఆశావర్కర్లు చేరుకుని.. ఆందోళన నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్లు మంజూరు చేయాలని... ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి డిమాండ్ చేశారు. ఆన్‌ లైన్ లేదా ఆఫ్‌ లైన్ పని ఏదైనా ఒకటి మాత్రమే చేస్తామని చెప్పారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు 36 గంటల నిరవధిక ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఆశావర్కర్లు వంట-వార్పు నిర్వహించారు. నిత్యవసరాల ధరల పెరుగుదలతో... చాలీచాలని జీతాలతో కుటుంబ భారం కష్టంగా మారిందని వాపోయారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. మంగళగిరి బస్టాండ్ వద్ద అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అంగన్ వాడీలు నిరసనలు తెలిపారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story