సీఎం జగన్‌‌కు అచ్చెన్నాయుడు లేఖ.. !

సీఎం జగన్‌‌కు అచ్చెన్నాయుడు లేఖ.. !
ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లు, భోధనేతర సిబ్బందికి నెలకు 10వేల భృతి ఇవ్వాలని కోరుతూ.. CM జగన్‌కు TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

ఏపీలో ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లు, భోధనేతర సిబ్బందికి నెలకు 10వేల భృతి ఇవ్వాలని కోరుతూ.. CM జగన్‌కు TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఉపాధ్యాయులకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణసౌకర్యం కల్పించేలా చూడాలన్నారు. ప్రభుత్వానికి వైన్ షాపులపై ఉన్న ధ్యాస.. టీచర్లను ఆదుకోవడంలో లేదని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు నెలకు 2 వేల రూపాయలతోపాటు, 25 కేజీ బియ్యం ఇస్తోందని, మిగిలిన రాష్ట్రాలు కూడా టీచర్లను ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నాయని CM దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 5 లక్షల మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌.. జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ సంస్థల్లోని అవుట్ సోర్సింగ్‌లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.

కరోనా ప్రభావం కారణంగా పాఠశాలలు నడవక కొంత మంది ఉపాధ్యాయులు కూరగాయలు అమ్ముతున్నారని, మరికొందరు భవన నిర్మాణ కార్మికులుగా మారి రోజు వారి కూలీలుగా పనిచేస్తున్నారని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందందన్నారు. గత ఏడాది కరోనా మొదటి వేవ్ టైమ్‌లోనూ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకోలేదని, ఇప్పటికైనా వారి పరిస్థితి గుర్తించి ఆదుకోవాలని కోరారు.

స్కూళ్లు లేక, జీతాలు అందక, కుటుంబ పోషణ జరక్క ఇప్పటి వరకు 25 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు చనిపోయినా ప్రభుత్వం మనస్సు ఎందుకు కరగటం లేదని అచ్చెన్న ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story