NTR: ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు... ప్రభంజనం

NTR: ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు... ప్రభంజనం
వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన పురందేశ్వరి.... సంక్షేమానికి మారుపేరు ఎన్టీఆర్‌ అన్న బీజేపీ ఏపీ చీఫ్‌....

నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ప్రభంజనమని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారని... సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనదని పురందేశ్వరి తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారని పురందేశ్వరి వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని... తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని.... అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.


మరోవైపు... దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని చంద్రబాబు అన్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది.. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పేదరికం లేని, కులమతాలకు అతీతమైన సమ సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ.. రామరాజ్య స్థాపనకు మనందరం కదలాలని పిలుపునిచ్చారు. అందుకే ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా’ అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా.. నేను ‘రా... కదలిరా’ అని పిలుపునిచ్చానని అన్నారు. తెలుగు ప్రజలారా రండి.. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.


మరోవైపు తెలుగుజాతి ఖ్యాతి, మహానాయకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.‌ కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story