టీవీ-5 వరుస కథనాలతో పోలీసు అధికారుల్లో కదలిక.. బొమ్మూరు బాలిక..

టీవీ-5 వరుస కథనాలతో పోలీసు అధికారుల్లో కదలిక.. బొమ్మూరు బాలిక..
టీవీ-5 వరుస కథనాలు, ప్రతిపక్షాల డిమాండ్‌లు, తల్లిదండ్రుల ఆందోళనలతో... బొమ్మూరు బాలిక అత్యాచారయత్నం కేసులో పోలీసు అధికారులు స్పందించారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాలిక..

టీవీ-5 వరుస కథనాలు, ప్రతిపక్షాల డిమాండ్‌లు, తల్లిదండ్రుల ఆందోళనలతో... బొమ్మూరు బాలిక అత్యాచారయత్నం కేసులో పోలీసు అధికారులు స్పందించారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాలిక తల్లిదండ్రుల్ని బెదిరించిన వారిపై... కేసు నమోదు చేశారు. అక్టోబర్‌ 1న బాలిక తండ్రి అర్బన్‌ ఎస్పీ ఆఫీస్‌ ముందు విషం తాగి.. ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్పందించిన రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ షిమోజీ బాజ్‌పాయ్‌ బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఈస్ట్‌జోన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి ముద్దాయిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు...

తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చెందిన దంపతులు... తమ పదేళ్ల కూతురుపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారని జులై 26న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణకు మొదటి నుంచీ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి ఆగస్టు 4న కేసు నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత సదరు యువకుల బంధువుల నుంచి బాధిత కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయిన బాలిక తండ్రి... ఈ నెల 1న రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ ఆఫీస్ ముందు విషం తాగారు. ఎస్పీ ఆఫీసు సిబ్బంది.. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడ GGHకు షిఫ్ట్‌ చేశారు...

కేసులో రాజీ కోసం నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు చాలా రకాలుగా ప్రయత్నించారని బాలిక తండ్రి సూసైడ్‌ నోట్‌లో రాశారు. తమ కుటుంబ పరువు దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. తన భార్య స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీయించి... వేధించారని ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిలదీస్తే తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ''ఎస్పీ గారూ మేం పేదవాళ్లం.. ప్రతిసారీ పోలీస్ స్టేషన్‌కు రావడం మా వల్ల కాదు'' అంటూ లేఖలో రాసుకొచ్చారు. తన భార్యా పిల్లల్ని కాపాడాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇది ఆత్మహత్య కాదని.. మానసిక హత్య అని లేఖలో రాశారు. ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బొమ్మూరు ఘటన, పోలీసుల తీరు, నిందితుల బంధువుల వ్యవహారంపై వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యులు పర్యటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story