CBN ARREST: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌.. అనుక్షణం హైటెన్షన్‌

CBN ARREST: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌.. అనుక్షణం హైటెన్షన్‌
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు అరెస్ట్‌... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్‌

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నంద్యాలలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా, F.I.Rలో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని.... పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాలు, నిబంధనలతో పని లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 I.P.C, 12, 13 (2) రెడ్ విత్ 13 (1) (C)(D) ప్రివన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైనందున చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత... నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్ లోనే గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లనున్నారు.

తెల్లవారుజామున ఐదున్నర గంటలకు బస చేస్తున్న బస్సు తలుపులను పోలీసులు గట్టిగా కొట్టడంతో... చంద్రబాబు కిందికి వచ్చారు. ఏ చట్టం ప్రకారం తనను అరెస్టు చేస్తారో చెప్పాలని గట్టిగా నిలదీశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. F.I.Rలో పేరు లేకుండా, ప్రాథమిక ఆధారాలు చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలను 24 గంటల్లో ఇస్తామని పోలీసులు చెప్పడంపై చంద్రబాబు మండిపడ్డారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని నిలదీశారు.

ఈ క్రమంలో చంద్రబాబుకు, పోలీసులకు మధ్య సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు స్పష్టంచేశారు. నిజంగా తప్పు చేసి ఉంటే నడిరోడ్డుపై ఉరితీయండని పోలీసులతో అన్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా, చట్టవిరుద్ధంగా వ్యవహిరిస్తామంటే సహించేది లేదన్నారు. ఈ ప్రక్రియ అంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కాసేపటి తర్వాత తేరుకున్న పోలీసులు బలవంతంగా లైవ్ స్ట్రీమింగ్ ను నిలిపివేయించారు. లైవ్ కెమెరాలు లాక్కున్నారు.

Tags

Read MoreRead Less
Next Story