దసరా తర్వాత గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర.. అమరావతి జేఏసీ

దసరా తర్వాత గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర.. అమరావతి జేఏసీ

అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.. ఆంక్షలను దాటుకుని, అధికార పార్టీ నేతల కుట్రలను తిప్పికొడుతూ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు.. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్నారు.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకైక లక్ష్యంతో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.

అమరావతి పరిరక్షణ సమతి నాన్‌ పొలిటికల్‌ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది.. ఉద్యమం 300 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడాన్ని జేఏసీ నేతలు తప్పుపడుతున్నారు. ఉద్యమకారులపై కేసులు పెట్టడం, దాడులు చేయడాన్ని ఖండిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.

దసరా తర్వాత గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించేందుకు అమరావతి జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు.. ప్రతి గ్రామానికి వెళ్లి అమరావతి ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 22న గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు ప్రజలందరితో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు వివరించారు.

అటు అమరావతి మునిగిపోతోదంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని రైతులు తిప్పికొట్టారు.. రాజధాని హైకోర్టు ప్రాంతం ముంపునకు గురయ్యింది అంటూ ప్రభుత్వమే విష ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.. ఎక్కడ ముంపు ముప్పు ఉందో చూపించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇకనైనా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. గతంలో కృష్ణా వరదల సమయంలో నీరు దిగువకు వదలకుండా ముంపు భయం అంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు మరోసారి అలాంటి తప్పుడు వార్తలు షేర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తంగా అమరావతిని సాధించుకునేందుకు అన్ని రూపాల్లో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు రాజధాని రైతులు.. ఉద్యమం 300 రోజులు దాటిన నేపథ్యంలో మరింత ఉధృతంగా పోరాట కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story