CBI: అజేయ కల్లం మాట మార్చారు: సీబీఐ

CBI: అజేయ కల్లం మాట మార్చారు: సీబీఐ
వివేకా హత్య కేసులో అజేయ కల్లంపై తీవ్ర ఒత్తిడి ఉందన్న సీబీఐ... అందుకే మాట మార్చారని కోర్టుకు వెల్లడి...

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లంపై తీవ్ర ఒత్తిడి ఉందని... అందుకే ఆయన మాట మార్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న మాజీ IAS అధికారి, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం ఆడియో రికార్డును సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించిందని, దాన్ని రికార్డుల నుంచి తొలగించాలన్న కల్లం ఆరోపణతో ఆయన వాంగ్మూలం రికార్డును తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. సీఎస్‌గా పనిచేసిన వ్యక్తే ఎదురుతిరిగితే సామాన్య సాక్షుల పరిస్థితి ఏంటని సీబీఐ ప్రశ్నించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 29న అజేయ కల్లం వాంగ్మూలాన్ని నమోదుచేయగా ఇంత ఆలస్యంగా దాన్ని ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ వెల్లడించింది. ఆయన చెబుతుంటే దర్యాప్తు అధికారి టైప్ చేశారని, తర్వాత ఆయన దాన్ని పరిశీలించి, మార్పులు చేర్పులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారని సీబీఐ తెలిపింది. తనపై ఒత్తిడి రావడంతో ఆ తర్వాత వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అజేయకల్లం చెప్పారన్నారు. ఈ స్థాయి సాక్షి ఎదురుతిరిగితే ఇతర సాక్షుల ఆలోచనలపై ప్రభావం చూపుతుంది సీబీఐ తెలిపింది.


వాంగ్మూలాన్ని వక్రీకరించారని అజేయ కల్లం పిటిషన్ దాఖలు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని సీబీఐ పేర్కొంది. ఈ పిటిషన్ విచారణార్హం కాదని వాదించింది. ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన అజేయ కల్లం ఇప్పుడూ, వాంగ్మూలం నమోదు చేసినప్పుడూ ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు. పిటిషన్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే సీబీఐ అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ, ఎస్పీ వికాస్‌ కుమార్ ఎదుట ఆయన ఇంట్లోనే నమోదుచేసిన వాంగ్మూలాన్ని ఇంత ఆలస్యంగా ఉపసంహరించుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ కౌంటర్‌లో పేర్కొంది. ఏప్రిల్ 29న వాంగ్మూలం నమోదుచేయగా ఇప్పటివరకు దర్యాప్తు అధికారిపై అజయ కల్లం ఫిర్యాదు చేయలేదంటే.... వాంగ్మూలానికి ఆయన అంగీకారం ఉన్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది. మాజీ IAS అధికారిగా C.R.P.C సెక్షన్ 161 కింద నమోదు చేసిన వాంగ్మూలం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసని.. చట్టప్రకారం వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారి రికార్డు చేసి, దాన్ని చదివి వివరిస్తారని పిటిషన్‌లో పేర్కొంది. సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి తన వాంగ్మూలం విరుద్ధంగా ఉందని మే మూడోవారంలో పత్రికల్లో వచ్చిన తర్వాత మీడియా సమావేశం ద్వారా ఖండించాల్సి వచ్చిందని ఆరోపించారు.

సీనియర్ అధికారిగా పనిచేసిన అజేయ కల్లం..ఈ కేసులో దర్యాప్తు సంస్థ, న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత చూపాల్సింది పోయి నేర న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు, సీబీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నమని ఆరోపించింది. వివేకా హత్యపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు చేశామని...నిర్దోషులను తప్పుగా ఇరికించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను భారీ జరిమానా విధిస్తూ కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ అభ్యర్థించింది.

Tags

Read MoreRead Less
Next Story