BABU CASE: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు

BABU CASE: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు
ముగిసిన చంద్రబాబు రెండు రోజుల కస్టడీ... ఆక్టోబర్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రిమాండు గడువు, రెండు రోజుల కస్టడీ ఆదేశాలు ఆదివారంతో ముగియడంతో చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ను అక్టోబర్‌ 5 వరకు పొడిగించిన న్యాయాధికారి, బెయిల్‌ పిటిషన్‌ నేడు విచారణకు వస్తుందని తెలిపారు.


రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆదివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల సమయంలో హాజరుపరచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయాధికారి మాట్లాడారు. మీపై ప్రస్తుతం వచ్చినవి అభియోగాలు మాత్రమేనన్నారు. దర్యాప్తు చేశాక నిజమా.. కాదా అనేది తేలుతుందన్నారు. సీఐడీ కస్టడీలో మొదటిరోజు విచారణ ఆలస్యంగా ప్రారంభమైందని తెలిసిందన్న ఆమె నిజమేనా అని ప్రశ్నించారు. మీ న్యాయవాది మీకు కనిపించేంత దగ్గర్లో ఉండేందుకు అనుమతిచ్చామన్న న్యాయాధికారి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలన్నామని గుర్తు చేశారు. ఈ సౌకర్యాలన్నీ కల్పించారా? థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా? వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పాం..... కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా?’’ అని ఆరా తీశారు. భౌతికంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు బదులిచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించానన్న చంద్రబాబు..... ఏ తప్పూ చేయలేదు....... ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. కావాలనే ఇరికించారన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు క్యాబినెట్‌ నిర్ణయమన్న చంద్రబాబు, దానికి తననెలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు. సీఐడీ సమర్పించిన దస్త్రాలను పరిశీలించాలని ఆయన న్యాయాధికారిని కోరారు.

స్పందించిన న్యాయాధికారి ‘‘దర్యాప్తు అనేది ఓ ప్రొసీజర్‌ మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం మీరు జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్నారన్న ఆమె.... మీపైన వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. తప్పుచేశానని అనుకోవద్దన్న న్యాయాధికారి, ఇవాళ మీ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వస్తుందన్నారు. ఈ దశలో మీరు తప్పుచేశారనే ప్రస్తావన ఉండదన్నారు. ఇప్పటికిప్పుడు నిజనిర్ధారణ జరగదన్న ఆమె, పూర్తిస్థాయిలో విచారణ చేశాక గానీ తప్పుచేశారా.. లేదా అనేది తేలదన్నారు. అందుకు కోర్టుకు కొంత సమయం పడుతుందన్న ఆమె, ఇదివరకే చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. ఈ దశలో మీరు తప్పుచేసినట్లు కాదు’అని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story