ఆలయాల్లో దాడులపై సీబీఐ విచారణ జరిపించాలి : చంద్రబాబు

ఆలయాల్లో దాడులపై సీబీఐ విచారణ జరిపించాలి : చంద్రబాబు
ఏపీలో హిందూ ఆలయాలు, సంస్థలపై దాడులు పెరిగిపోతుండటంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు ..

ఏపీలో హిందూ ఆలయాలు, సంస్థలపై దాడులు పెరిగిపోతుండటంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ధార్మిక సంస్థలు, ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమన్నారు. అంతర్వేది సహా అన్ని ఆలయాల్లో దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు విశాఖపట్నం నుంచి ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వెళ్తుండగా కాకినాడలో పోలీసులు నిర్బంధించారు. అంతర్వేదికి అనుమతి లేదని వారించారు. ఆ తరువాత పోలీసుల అనుమతితో అమలాపురం చేరుకుని సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంంలో రావులపాలెం వద్ద పోలీసులు స్వామీజీని అడ్డుకున్నారు. ఆలమూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, తనను అక్రమంగా అరెస్టు చేశారని స్వామీజీ ఆరోపించారు.

మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో నంది, శివలింగాలను ప్రతిష్టించిన ఉదంతం వివాదాస్పదమవుతోంది.. తిరుపతి అర్బన్‌ ఎస్పీని బీజేపీ నేతలు కలిశారు.. నంది, శివలింగాలను ప్రతిష్టించిన వారిని వెంటనే గుర్తించాలని వారు ఎస్పీని కోరారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను గుర్తించడంలో కాళహస్తి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తిరుపతిలో టీడీపీ నాయకులు పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ఆంజనేయస్వామికి ప్రార్థనలు చేశారు.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story