EC: ఎన్నికల విధుల్లో దురుద్దేశాన్ని ఉపేక్షించం

EC: ఎన్నికల విధుల్లో దురుద్దేశాన్ని ఉపేక్షించం
అధికారులకు రాజీవ్‌కుమార్‌ హెచ్చరిక... ఏ ఒక్కరికి అనుకూలంగా వ్యవహరించొద్దని ఆదేశం....

ఎన్నికల విధుల్లో దురుద్దేశ పూర్వకంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఒక పార్టీకో.. ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎన్నికల అధికారులు అన్ని రాజకీయ పార్టీలకూ, అందరు అభ్యర్థులకూ సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. అత్యంత సున్నితంగా ఉన్న ఎన్నికల పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పక్షాలు అభ్యంతర కరమైన భాషను వినియోగించకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంత ఓటర్లు సోషల్ మీడియా బటన్‌తో పాటు EVM బటన్ లూ నొక్కాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రలోభాలకు ఆస్కారం లేని స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయటం, జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా చూడటం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు.


ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులందాయని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరాయన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరటంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సంసిద్ధతపై రెండు రోజుల పాటు అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2024 ఏడాదిలో తొలిసారి మీడియా సమావేశాన్ని ఏపీతోనే ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

ఓట్ల తొలగింపు, గంపగుత్తగా ఓట్లు చేర్చడం, సున్నా డోర్‌ నంబరుతో భారీగా ఓట్ల నమోదుపై కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై మరింత పర్యవేక్షణ పెంచాలని, ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాయి. నకిలీ ఓట్లు వేసేందుకు వీలుగా కొందరు భారీగా ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా పోలీసు పరిశీలకుల్ని నియమించాలని, పారా మిలటరీ బలగాల్ని పంపించాలని కోరాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ఎలాంటి గొడవలు జరగకుండా జరిపేందుకు ఈసీ పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్నికల సిబ్బంది, ఉన్నతాధికారులంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అన్ని పక్షాలకు సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశాం. అది వారి బాధ్యత. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు. పోలింగ్‌కు వెళ్లే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌కు బదులు ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటుహక్కు వినియోగించుకుంటారు.

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.07 కోట్లుగా ఉందని.... పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ ఉన్నట్టు వెల్లడించారు. 46 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక సజావుగా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఇళ్ల వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

Tags

Read MoreRead Less
Next Story