ఏపీ ఉద్యోగుల్లో చిచ్చు రేపిన పంచాయతీ ఎన్నికలు

ఏపీ ఉద్యోగుల్లో చిచ్చు రేపిన పంచాయతీ ఎన్నికలు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వర్సెస్ అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజుగా సీన్‌ మారింది.

పంచాయతీ ఎన్నికలు ఏపీ ఉద్యోగుల్లో చిచ్చు రేపాయి. కరోనా వ్యాక్సినేషన్‌ తర్వాతే ఎన్నికలను నిర్వహించాలన్న ప్రభుత్వ వాదనకు సచివాలయ, అమరావతి ఉద్యోగులందరూ మద్దతు ఇచ్చారు. ఐతే.. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు రావడం.. ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ వేగవంతం చేయడం చకచకా జరిగిపోయింది. అటు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు సహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు, అమరావతి ఉద్యోగుల జేఏసీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ రెండు సంఘాల మధ్య మాటలయుద్ధం సాగుతోంది.

తొలి నుంచి ఈ రెండు సంఘాలు కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వ వాదనకు మద్దతిస్తున్నాయి. అయితే కోర్టు తీర్పు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఎస్ఈసీకి సహకరిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కొంతమంది ఉద్యోగులను కొన్ని రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాయని ఆయన కామెంట్ చేయడంపై.. అమరావతి ఉద్యోగుల సంఘం జేఏసీ మండిపడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోలు ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తుచేశారు. అప్పుడు స్పందించని నేతలు... ఇప్పుడు రాద్ధాంతం చేయడం తగదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల పంచాయితీపై వెంకట్రామిరెడ్డి అతిగా స్పందించారని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కింది స్థాయి ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డికి సంబంధమే లేదన్నారు. ప్రభుత్వ ప్రాపకం కోసం వెంకట్రామిరెడ్డి ఆరాటపడుతున్నారని ఆయన విమర్శించారు. వెంకట్రామిరెడ్డికి కిందిస్థాయి ఉద్యోగులతో సంబంధాలే లేవని, కానీ అన్ని ఉద్యోగ సంఘాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఇక బొప్పరాజు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు వెంకట్రామిరెడ్డి. అందరూ మొదట ఎస్‌ఈసీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించారని చెప్పారు. కోర్టు తీర్పు ఎస్‌ఈసీకి అనుకూలంగా రావడంతో కమిషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని మాట మార్చారన్నారు. బొప్పరాజు ఆరోపణలతో ఉద్యోగుల పరువు పోతోందని వెంకటరామిరెడ్డి అన్నారు. మొత్తానికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వర్సెస్ అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజుగా సీన్‌ మారింది.

Tags

Read MoreRead Less
Next Story