CM Jagan: అక్టోబరు నుంచి విశాఖలో సీఎం జగన్!

CM Jagan: అక్టోబరు నుంచి విశాఖలో సీఎం జగన్!
రుషికొండపై చురుగ్గా కార్యాలయ నిర్మాణం

విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర పాలనను నడపడానికి జగన్ సర్కారు సిద్ధమవుతోంది. రుషికొండపై ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అక్టోబరు 24 నుంచి సీఎం జగన్‌ విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తారంటున్నాయి పోలీసు వర్గాలు. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు భవనాలను పరిశీలించారు. వీరితో జీవీఎంసీ అధికారులు, ఆర్కిటెక్ట్‌ల బృందం కూడా వెళ్లింది. రుషికొండపై పర్యాటక ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అధికారులు బయటకు చెబుతున్నప్పటికీ సీఎం కార్యాలయం కోసమే ఆగమేఘాల మీద పనులు జరుగుతున్నాయనే ప్రచారానికి ఇది మరింత బలాన్ని చేకూర్చింది. భవన నిర్మాణాల డిజైన్‌ కూడా రిసార్టుల మాదిరిగా కాకుండా కార్పొరేట్‌ కార్యాలయం తరహాలో ఉండడం గమనార్హం. ఈ భవనాల్లో ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. ఆయా పనులను ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం అధికారులు పరిశీలించి, అనుమతి తెలపాల్సి ఉంటుందంటున్నారు పోలీసులు. వీరి వెంట జీవీఎంసీ అధికారులతోపాటు అర్కిటెక్ట్స్‌ బృందం కూడా ఉంది. ఆ సమయంలో ఎవరినీ లోపలకు అనుమతించలేదు.

సీఎం జగన్‌ ఈ ఏడాది అక్టోబరు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించనున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా వారానికి మూడు రోజులు ఇక్కడ, మిగిలిన మూడు రోజులు అమరావతిలో ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం విశాఖపట్నంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కార్యాలయం కోసం రుషికొండపై పర్యాటక స్థలంలో 200 కోట్లతో భారీ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో మొదటి దశ పూర్తయింది. అక్కడి నుంచి జగన్‌ అధికారిక కార్యకలాపాలు సాగిస్తారని తెలుస్తోంది. రుషికొండలోని ‘బే పార్కు’లో జగన్‌ కుటుంబంతో కలిసి నివాసం ఉంటారని సమాచారం.

ఇది కూడా పర్యాటక శాఖ ప్రాజెక్టే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థను తప్పించి, హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యంతో దానిని టేకోవర్‌ చేయించారు. సీఎం సతీమణి భారతికి బే పార్కు పరిసరాలు బాగా నచ్చడం, భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు లేకపోవడంతో దానిని ఎంపిక చేసుకున్నారు. బేపార్కు, రుషికొండ కార్యాలయానికి మధ్య దూరం కేవలం అర కిలోమీటరే. ఒకటి రోడ్డుకు ఇటు వైపు ఉంటే... మరొకటి అటు వైపు ఉంటుంది. రెండింటికీ ఎదురుగా సముద్రం ఉంటుంది.

మూడు రాజధానుల బిల్లుకు చట్టబద్ధత లభించకపోవడం, న్యాయస్థానంలో కేసులు విచారణలో ఉండడంతో అధికారికంగా విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి అవకాశం లేదు. అందుకని క్యాంపు కార్యాలయం పేరుతో రుషికొండలో సీఎం పేషీ ఏర్పాటుచేసి పాలన సాగించనున్నారని తెలిసింది. ముఖ్యమైన అధికారుల కోసం రుషికొండ, ఎండాడలతో పాటు సీతమ్మధారలోని ఆక్సిజన్‌ టవర్స్‌లో ఫ్లాట్లు, మరికొన్నిచోట్ల విల్లాలు రిజర్వ్‌ చేసి పెట్టారు. రుషికొండపై పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న భవనాలను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం పర్యాటకుల కోసమే ఉపయోగించాలి. రిసార్టులు, హోటళ్లకు వినియోగించాలి. అంతేకానీ పరిపాలనా కార్యాలయాలకు ఉపయోగించకూడదు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఇప్పటికే ప్రత్యేక కమిటీ కూడా నిర్ధారించింది.

Tags

Read MoreRead Less
Next Story