Jagan bus Yatra : అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Jagan bus Yatra : అనకాపల్లి జిల్లాలో  సీఎం జగన్‌ పర్యటన
అన్యాయం చేసి ఎలా ఓట్లు అడుతున్నారంటూ ప్రజల ఆగ్రహం

హామీలిచ్చి... అరచేతిలో స్వర్గం చూపించడంలో సీఎం జగన్‌ది ‌అందెవేసిన చెయ్యి..! 2019కి ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టారీతిన హామీలిచ్చారు. తీరా చూస్తే... ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పక్కనపెట్టారు. సాగునీటి వనరులను అస్మదీయులకు కట్టబెట్టి.... అన్నదాతలను అంధకారంలోకి తోసేశారు. సహకార చక్కెర కర్మాగారాల్ని మూసేసి. చెరకు రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీ నెరవేర్చని... జగన్‌ ఓట్ల కోసం నేడు జిల్లాకు వస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని..., తాను పేదల పక్షాన ఉన్నానంటూ జగన్‌ ఊదరగొడుతుంటారు. కానీ అవన్నీ మాటలకే పరిమితమని... అనకాపల్లి జిల్లాలోని రైతులు పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని షిర్డీసాయి, అదానీ వంటి అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి.. పేద రైతుల గొంతుకోశారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయర్‌ కింద.. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో 51 వేల 465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయంలో సరిపడినన్ని నీళ్లు ఉండవని జలవనరులశాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఈ రిజర్వాయర్‌ కింద వారబందీ విధానంలో నీళ్లు విడిచిపెట్టారంటే సాగునీటికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో అర్థమవుతుంది. అలాంటి ప్రాజెక్టుకు ఎగువున కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ నెలకొల్పనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు 0.56 టీఎంసీ నీళ్లు కేటాయించారు. ఆ మేరకు తాండవ జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గిపోతుందని జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్‌ పట్టించుకోలేదు.

రైవాడ జలాశయం నీటిని పూర్తిగా సాగునీటి అవసరాలకే వినియోగించేలా చూస్తామని.., అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైవాడ జలాశయం కింద 44 గ్రామాల పరిధిలో 15 వేల 344 ఎకరాల ఆయకట్టు ఉంది. జీవీఎంసీ తాగునీటి అవసరాలకు రోజూ 50 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువున అనంతగిరి మండలంలోని పెదకోట వద్ద అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టుకు 0.39 టీఎంసీ నీళ్లు కేటాయించేశారు.

జగన్‌ పాలనలో మూడు సహకార చక్కెర కర్మాగారాలు మూసేశారు. తుమ్మపాల కర్మాగారాన్ని విక్రయించాలని నిర్ణయించారు. లిక్విడేటర్‌ని పెట్టి ఆస్తులు అంచనా వేయించారు. రైతులు అడ్డుకుని కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని2021లో మూసేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. బకాయిల కోసం జరిగిన ఉద్యమంలో ఒక రైతు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎప్పటికో చెల్లించారు. 350 మంది ఉద్యోగులకు నేటికీ పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేదు. ఇంకా 13 కోట్ల 50 లక్షలు పెండింగ్‌లో ఉంచారు. ఏటికొప్పాక చక్కెర కర్మాగారం సిబ్బందికి 8 కోట్ల 50 లక్షల చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక పరిశ్రమల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 15 వేల మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు

Tags

Read MoreRead Less
Next Story