AP DSC 2024: అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ డీఎస్సీ

AP DSC 2024:  అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ డీఎస్సీ
ఆన్‌లైన్‌ దరఖాస్తులో గంగదరగోళం

నాలుగున్నరేళ్ల తరువాత ఎన్నికల ముందు హడావుడిగా DSCని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం దాని నిర్వహణనూ గందరగోళం చేస్తోంది. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్‌ వరకు అడుగడుగునా అయోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే DSC పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని పోస్టులకు పరీక్షల నిర్వహణలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి అంశంలోనూ గందరగోళానికి తావిస్తోంది.

మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జారీ చేసిన జీఓ-77లో కొత్త రిజర్వేషన్‌ రోస్టర్‌ను ప్రకటించింది. వీరికి హారిజంటల్‌ రిజర్వేషన్‌ పాటించాలని, సమాంతర రోస్టర్‌ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ, డీఎస్సీలో... ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ , పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ , ప్రిన్సిపల్‌ పోస్టులకు సమాంతర రోస్టర్‌ పాయింట్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోస్టర్‌ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ , స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాలో హారిజంటల్, మరికొన్ని జిల్లాల్లో రోస్టర్‌ పాయింట్లు రిజర్వేషన్‌ అమలు చేశారు. ఎస్జీటీ, ఎస్‌ఏలకు కొన్ని జిల్లాలు ఒక విధానం మరికొన్ని జిల్లాలు మరో విధానాన్ని పాటించాయి.

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3-5 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్, 6-10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డీఎస్సీకి వచ్చేసరికి కేవలం టాపిక్స్‌ మాత్రమే ఇచ్చింది. టెట్‌కు 20 రోజులు సమయం ఇవ్వగా ఆ తర్వాత డీఎస్సీకి ఐదు రోజులే మిగిలి ఉంది. టెట్‌కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత ఐదు రోజుల్లోనే డీఎస్సీ ఎలా రాయగలుతారు? టెట్‌ కోసం చదివిన సిలబస్‌కు డీఎస్సీకి సిలబస్‌కు కొంత వ్యత్యాసం ఉంది. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్‌ మొరాయించి, వెబ్‌సైట్‌ పని చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నా ఐడీ రాక కొంతమంది రెండు, మూడు పర్యాయాలు రుసుము చెల్లించాల్సి వస్తోంది.

డీఎస్సీకి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా చూపించలేదు. కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగటంతో దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్‌ ఐచ్ఛికం ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్లీ దరఖాస్తు చేయాలా? లేదంటే ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తుందా అనేదానిపై స్పష్టత లేదు.ఈనెల22తో దరఖాస్తు గడువు ముగియనున్నందున ఈ అంశాలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story