Tirumala: తిరుమలలో పురాతన మండపాల కూల్చివేత

Tirumala: తిరుమలలో  పురాతన మండపాల కూల్చివేత
జీర్ణోద్ధరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు

పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో తొలగించి పునర్నిర్మాణాలు చేస్తున్నామంటూ ఇటీవల తితిదే తీసుకున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. దాదాపు ఐదు శతాబ్ధాల చరిత్ర కలిగిన తిరుమల శ్రీవారి పార్వేట మండపాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించారు. తాజాగా అలిపిరి నడక దారిలో భక్తుల విశ్రాంత మండపం తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో పలువురు దీన్నివ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.

తిరుమల పురాతన మండపాల పేరుతో పురాతన కట్టడాలు కూల్చివేతపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవలే పార్వేట మండపం కూల్చివేసి నూతన మండపం నిర్మించారు. తాజాగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న విశ్రాంత మండపం తొలగించాలనే నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పురాతన నిర్మాణాలను సంపదగా భావించకుండా అడ్డగోలు నిర్ణయాలతో కూల్చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అలిపిరి వద్ద కాలినడక భక్తులు విశ్రాంతి కోసం నిర్మించిన ప్రాచీన మండపం మరమ్మతులకు కూడా వీలుకానంతగా దెబ్బతిందని అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ మండపాన్ని కూల్చివేసి కోటి 36లక్షల రూపాయలతో కొత్త మండపం నిర్మిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. దీనిపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. పురాతన కట్టడాలను భారత పురావస్తుశాఖ అనుమతి లేకుండా కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పురాతన కట్టడాలు తొలగింపు విషయాన్ని ఆర్కియాలజీ దృష్టికి తీసుకెళ్లామని తితిదే ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. పురాతన మండపాలు పునర్నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి పురావస్తుశాఖకు లేఖ రాస్తామని చెబుతున్నారు. పురాతన కట్టడాలపై ఆర్కియాలజీ నిర్దేశం ప్రకారం తితిదే అధికారులు నిర్ణయాలు తీసుకొవాలని భాజపా నేతలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story