Tirupati By-election: మరో అధికారిపై ఈసీ సస్పెన్షన్‌ వేటు

Tirupati By-election: మరో అధికారిపై ఈసీ సస్పెన్షన్‌ వేటు
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు కేసులో

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో 35వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసి, వాటితో దొంగ ఓట్లు వేయించిన ఘటనలో తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన నిజాలు బయడపడుతున్నాయి. అసలు ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ రిజిష్ట్రేషన్‌ అధికారిగా నియమించకుండానే అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్‌గా పనిచేసిన పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి E.R.O.గా బాధ్యతలు నిర్వహించేసి దొంగ ఓట్ల దందాకు తెరతీసినట్లు తేలింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయించింది.

ఎన్నడూ ఎరుగని ఎన్నికల మోసం బయటపడింది. బరితెగింపునకు పరాకాష్ఠ అంటే ఏమిటో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఓట్ల అక్రమాల ద్వారా అధికార పార్టీ చూపించింది. జగన్ ప్రభుత్వం, వైకాపా నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగించిన అతి పెద్ద నేరపూరిత కుట్ర ఇది. తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్‌గా పనిచేసిన పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా, తిరుపతి శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ 2021 మార్చి 17న ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఆయన్ను నియమించలేదు. అయినా చంద్రమౌళీశ్వర్ రెడ్డి తనంతట తానే ఈఆర్వోగా బాధ్యతలు నిర్వర్తించేశారు. తన పేరు, ఫోన్‌ నంబర్ను ఈఆర్వో ప్రొఫైల్స్ కనిపించేలా పెట్టుకున్నారు. ఇది అతి పెద్ద ఎన్నికల నేరం. ఈఆర్వో నెట్ నుంచి 35 వేలకు పైగా ఓటరు గుర్తింపుకార్డులు అక్రమంగా డౌన్ లోడ్ చేయటం, వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసే నేరపూరిత కుట్ర అమలుకు ఇక్కడే బీజం పడింది. ఈ వ్యవహారంలో చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ప్రమేయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆయన్ను సస్పెండ్ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. ఆయన ప్రస్తుతం మెప్మాలో సహాయ డైరెక్టర్‌గా ఉన్నారు.

చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని తాము ఈఆర్వోగా నియమించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరి ఆయన్ను ఈఆర్వోగా ఎవరు నియమించినట్లు? ఆయనకు ఆ ఆథరైజేషన్ ఎవరు ఇచ్చినట్లు? ఈఆర్వో లాగిన్ ఐడీ, పాస్ వర్డు ఆయనకు ఎక్కడివి? వీటికి సంబంధించి ఏవైనా దస్త్రాలు నడిచాయా? అవి ఎక్కడున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీషా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పుడు చంద్ర మౌళీశ్వర్రెడ్డి సస్పెండ్ అయ్యారు. వీరి వెనక ఉన్న అసలు కుట్రదారుల పాత్ర కూడా బయటకు రావాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story