AP Joint Staff Council: ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి

AP Joint Staff Council: ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి
ఇంకా రాని స్పష్టత

ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. ఎన్నికలకు ముందు నిర్వహించే చివరి సమావేశం కావడంతో ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్న ఆశతో వెళ్లిన నేతలకు నిరాశ మిగిలింది. బకాయిల చెల్లింపులు, ఇతర అంశాలపైనా స్పష్ఠత రాకపోవడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

సచినాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎస్ జవహర్‌రెడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థికేతర అంశాలపైనే చర్చించాలని, ఆర్థిక అంశాలపై ఎలాంటి చర్చ ఉండదంటూ స్పష్టం చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయ్యారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 21 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలే మాట్లాడాలంటూ నిబంధన పెట్టడంపైనా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలకు సంబంధించి అర్హుల జాబితా రూపొందించడంపై హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. జడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాల్లో అర్హుల జాబితా రూపొందించడం, నగదు రూపంలో పెన్షనర్లకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలను వెల్లడించడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, సెలవుల విషయాలపై చర్చ జరగలేదని ఉద్యోగుల ప్రతినిధులు ప్రకటించారు.

ఎన్నికల కోడ్‌ రానుండడంతో ఉద్యోగ సంఘాలతో జరిగే చివరి సమావేశం కావడంతో శుభవార్త చెబుతారని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశపడ్డారు. ఐఆర్‌ ప్రకటిస్తారని భావించినా నిరాశ తప్పలేదు.

‘‘ఆర్థికేతర డిమాండ్లపైనే మాట్లాడాలని ఆర్థిక డిమాండ్లపై ఇప్పటికే మంత్రుల కమిటీ చెప్పిందే ఫైనల్‌’’ అని సీఎస్‌ స్పష్టం చేయడంతో సమావేశం ఎలాంటి ఫలితాన్నివ్వకుండానే ముగిసింది. ఈ సమావేశం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ఎస్టీయూ అధ్యక్షుడు సాయిశ్రీనివాస్‌, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు బాలాజి తదితరులు పాల్గొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story