ఆంధ్రప్రదేశ్

రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టీకమా?

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలా? రైతులేమైనా రౌడీలా? గూండాలా? ప్రభుత్వ తీరు, పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..

రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టీకమా?
X

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలా? రైతులేమైనా రౌడీలా? గూండాలా? ప్రభుత్వ తీరు, పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం... శాంతి యుతంగా రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టీకమా? మూడు రోజుల క్రితం రాజధాని గ్రామం కిష్టాయపాలెంకు చెందిన 8 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై ప్రతిపక్ష టీడీపీ, విపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజా, కోవెలమూడి నాని, పిల్లి సంగీతారావు, అమరావతి జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ రైతులను పరామర్శించారు.

రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం, సంకెళ్లు వేసి జైలుకు పంపడమే ధ్యేయంగా జగన్‌ సర్కారు పనిచేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రతిఫలంగా సంకెళ్లు వేస్తారా అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా సంఘాలు, రైతులపై గతంలో పోలీసులతో కుళ్ళబొడిచారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు చేసి రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మానసిక ఉన్మాదానికి ఎంతమంది బలి కావల్సి వస్తుందో అని ఆలపాటి రాజా తీవ్రంగా మండిపడ్డారు.

315 రోజుల నుంచి ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని టీడీపీ నేతలు విమర్శించారు. నిరంకుశ విధానాలు విడనాడాలన్నారు. రైతులపై కేసుపెట్టిన వ్యక్తి విత్ డ్రా చేసుకున్న తర్వాత కూడా పోలీసు అధికారులు మళ్లీ అట్రాసిటీ కేసు నమోదు చేయటమేమింటని నేతలు ప్రశ్నించారు. పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడమేంటని వారు నిలదీశారు. రైతులు శాంతి యుతంగా ఉద్యమాన్ని చేస్తుంటే వారికి బేడీలు వేసి హింసకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సర్కారు రైతులు, రైతు కూలీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని నేతలు ఫైర్ అయ్యారు.

Next Story

RELATED STORIES